Rajagopal Reddy Vs Revanth: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైపోయినట్టు కనిపిస్తోంది. నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి పై ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శలు చేస్తే..ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. ఒకరిద్దరు మాట్లాడుతున్నప్పటికీ.. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే స్థాయిలో వారి మాటలు ఉండడం లేదు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం కనిపించడం లేదు. ముఖ్యంగా నేతల మధ్య క్రమశిక్షణ రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎవరిపై ఎవరి విమర్శలు చేస్తారో? ఎందుకు విమర్శలు చేస్తున్నారో ఏమాత్రం అంతు పట్టడం లేదు.
Also Read: బుమ్రా ను మర్చిపోండి భయ్యా.. ఇకపై సిరాజే మన రేసుగుర్రం..
ఇక మునుగోడు శాసనసభ స్థానం నుంచి సభ్యుడిగా ప్రాతినిధ్యం ఇస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ సీఎం వ్యవహార శైలి పట్ల కొద్దిరోజులుగా ఆగ్రహంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.. ఇటీవల తనే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆ ప్రకటన చేసిన కొద్దిసేపటికే మునుగోడు ఎమ్మెల్యే తనదైన వ్యాఖ్యానాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించడం సరైన విధానం కాదని.. ఇది రాజరిక వ్యవస్థ కాదని.. ప్రజాస్వామ్యమని.. ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు ఉండాలని రాజగోపాల్ రెడ్డి చురకలు అంటించారు.. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇక ఇటీవల ఓ పత్రిక 10వ వార్షిక వేడుకలకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాత్రికేయుల వ్యవహార శైలి పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మీడియా పాత్రికేయులను ప్రశంసించిన ముఖ్యమంత్రి.. సామాజిక మాధ్యమ పాత్రికేయులను మాత్రం తీవ్రస్థాయిలో విమర్శించారు. అంతేకాదు ప్రధాన మీడియాలో పనిచేసే పాత్రికేయులు.. సో కాల్డ్ సోషల్ మీడియాలో పనిచేసే పాత్రికేయులను దూరం పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఓ వర్గం నుంచి విమర్శలు వచ్చాయి. సహజంగా ఆ వర్గం ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్న తరుణంలో.. అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు వినిపించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అనే కామెంట్ కు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నేరుగా స్పందించారు. ఇక తాజాగా సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల రాజగోపాల్ రెడ్డి నేరుగా కల్పించుకున్నారు. తెలంగాణ ఆకాంక్షల మేరకు సామాజిక మాధ్యమం తన శక్తి కొద్ది పనిచేస్తూనే ఉంది. వారిని దూరం పెట్టాలని.. ప్రధాన మీడియా వారిని విభజించి పాలించినట్టే అవుతుంది. ఇటువంటి పన్నాగాలను సమాజం ఏమాత్రం సహించదని” రాజగోపాల్ రెడ్డి తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడినా సరే మునుగోడు ఎమ్మెల్యే తగ్గడం లేదు. పైగా అంతకుమించి అనే రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రిని నేరుగా ప్రశ్నిస్తూ వార్తల్లో ఉంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు గులాబీ పార్టీ అనుకూల మీడియా విపరీతంగా ప్రచారం కల్పిస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి ఈ స్థాయిలో ముఖ్యమంత్రి పై ఆగ్రహం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడమేనని తెలుస్తోంది. మరోవైపు పెద్దపెద్ద కాంట్రాక్టులు మంత్రికి చెందిన కంపెనీకి ఇస్తుండడం రాజగోపాల్ రెడ్డికి నచ్చడం లేదని సమాచారం.
ఇటీవల ఓ కాంట్రాక్టు ఓ మంత్రికి చెందిన కంపెనీకి ఇవ్వడం.. మునుగోడు ఎమ్మెల్యేకు నచ్చలేదట. ఇదే విషయాన్ని తన అంతరంగీకులతో చెప్పుకొని బాధపడ్డాడట. పైగా ఇటీవల మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం లభిస్తుందని ఆయన భావించారు. అటు మంత్రి పదవి రాకపోవడం.. ఇటు కాంట్రాక్టులు దక్కకపోవడంతో.. మునుగోడు ఎమ్మెల్యే తన అసహనాన్ని ఈ విధంగా బయటపెడుతున్నారని.. ఏకంగా ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. గతంలో తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి పై ఇదే స్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆయనను సస్పెండ్ చేసింది. మరి మునుగోడు ఎమ్మెల్యే విషయంలో ఏం చేస్తుందనేది చూడాల్సి ఉంది.