https://oktelugu.com/

Kalvakuntla Kavitha : గోటి చుట్టూ రోకటి పోటు అంటే ఇదే కాబోలు.. పాపం కేసీఆర్ కుమార్తె

ఆమె వాంగ్మూలాన్ని ధృవీకరిస్తూ జైలు అధికారి తప్పనిసరిగా సంతకం చేయాలని అన్నారు. వాంగ్మూలం ఇచ్చే క్రమంలో కవితపై ఎలాంటి ఒత్తిళ్లకు పాల్పడొద్దని ఆదేశాలు జారీ చేశారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 6, 2024 9:14 pm
    BRS MLC Kavitha

    BRS MLC Kavitha

    Follow us on

    Kalvakuntla Kavitha : దెబ్బ మీద దెబ్బ.. అవరోధం మీద అవరోధం. ఒకదాని వల్ల పడుతున్న ఇబ్బంది సరిపోడం లేదంటే.. మరో ఇబ్బంది ఎదురుగా వస్తోంది.. దాని నుంచి కాచుకునే ప్రయత్నం చేస్తుండగానే మరో ఇబ్బంది.. ఇలా వరుస ఇబ్బందులతో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా కలత చెందుతున్నారు.. వాస్తవానికి గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి ఓడిపోయిన నాటి నుంచి ఆమెకు ఒకదాని వెంట ఒకటి అవరోధాలు తగులుతున్నాయి. ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోతే.. కేసీఆర్ ఎమ్మెల్సీని చేశారు. అది తప్ప ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆమెకు లాభం చేకూర్చిన అంశం ఒక్కటంటే ఒక్కటి లేదు.

    అంతు చిక్కడం లేదు

    ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఎప్పుడైతే ఆమెను ప్రశ్నించారో అప్పటినుంచి ఆమెకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. వరుస విచారణలు. ఆమె వాడిన ఫోన్ల అప్పగింత.. మధ్యలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. అక్కడి నుంచి స్టే తెచ్చుకోవడం.. తర్వాత అనూహ్యంగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మళ్లీ ఎంట్రీ ఇవ్వడం.. ఆమెను అరెస్టు చేయడం.. ఢిల్లీ కోర్టులో చుక్కెదురు కావడం.. ఇలా ఒకదాని వెంట ఒకటి జరిగేసరికి అటు కవితకు.. ఇటు కేసీఆర్ కు పరిస్థితి అంతు పట్టడం లేదు. ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. తన కుమారుడి పరీక్షలు ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని కోరినప్పటికీ కోర్టు పట్టించుకోలేదు. సరి కదా ఇప్పుడు ఢిల్లీ మధ్య కుంభకోణం విషయంలో సిబిఐ ని విచారించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడం కవితకు మింగుడు పడని విషయం.

    సిబిఐకి అనుమతి

    మద్యం కుంభకోణంలో తనను ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతి ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ కవిత తరఫున న్యాయవాది నితీష్ రాణా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ తమకు దరఖాస్తు ఇవ్వలేదని కోర్టుకు విన్నవించారు. అంతేకాదు కవితను సిబిఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని ఆయన కోర్టును కోరారు. వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక నిందితురాలిగా పరిగణిస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేసిన కవితను.. ప్రశ్నించేందుకు రౌస్ అవెన్యూకోర్టు శుక్రవారం సిబిఐ కి అనుమతి ఇచ్చింది. తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న కవితను విచారించాలని సిబిఐ పిటిషన్ దాఖలు చేయడంతో.. కోర్టు అనుమతి ఇచ్చింది. పలు షరతులు కూడా విధించింది. ఈ నేపథ్యంలో కవిత తరపు న్యాయవాది రౌస్ అవెన్యూకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కవిత పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు సిబిఐ కాస్త సమయం కోరింది. అయితే ఏ నిబంధనల ప్రకారం అప్లికేషన్ దాఖలు చేశారో చెప్పాలని న్యాయమూర్తి కావేరి భవేజా సిబిఐ ని ప్రశ్నించారు. అంతేకాదు కోర్టు సంతృప్తి పడే విధంగా సమాధానం ఉండాలని అన్నారు. కవిత పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు సిబిఐకి ఈనెల 10 వరకు న్యాయమూర్తి సమయం ఇచ్చారు. తదుపరి విచారణను ఈనెల 10న చేపడతామని ప్రకటించారు. కవిత ను సిబిఐ విచారించడం పై స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దానికి న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్ తరపు వాదనలు విన్న తర్వాతే.. తదుపరి ఉత్తర్వులు ఉంటాయని కోర్టు ప్రకటించింది.

    100 కోట్లకు పైగా ముడుపులు ఇచ్చారు

    అంతకుముందు శుక్రవారం కవితను విచారించాలని సిబిఐ కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్లకు పైగా ముడుపులు చెల్లించడంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత కీలకపాత్ర పోషించారని సిబిఐ తరఫున న్యాయవాదులు శుక్రవారం కోర్టు ఎదుట విన్నవించారు. ఈమద్యం కేసులో కవిత పాత్రకు సంబంధించి విచారణకు రావాలని ఫిబ్రవరి 26న పిలిచామని.. అయితే ఆమె హాజరు కాలేదని సిబిఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో మార్చి 15న కవితను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారని సిబిఐ అధికారులు అన్నారు. సిబిఐ అధికారులు సమర్పించిన ఆధారాలను మొత్తం పరిశీలించిన కోర్టు విచారణకు అంగీకరించింది. వచ్చే వారం రోజుల్లో ఏదో ఒక రోజు జైలు సూపరింటెండెంట్ కు సమాచారం ఇచ్చి విచారణ జరుపుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. ఆమె వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు అసిస్టెంట్/ డిప్యూటీ సూపరింటెండెంట్ లు అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఆమె వాంగ్మూలాన్ని ధృవీకరిస్తూ జైలు అధికారి తప్పనిసరిగా సంతకం చేయాలని అన్నారు. వాంగ్మూలం ఇచ్చే క్రమంలో కవితపై ఎలాంటి ఒత్తిళ్లకు పాల్పడొద్దని ఆదేశాలు జారీ చేశారు.