RR Pink Promise : ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే డబ్బులతో కూడుకున్న ఆట.. కార్పొరేట్ కంపెనీలు ఆడే ఆట.. ఇన్ని సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఓ జట్టు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఎంత బాగుందంటే.. ఆ మ్యాచ్ ద్వారా చాలామంది పేదల జీవితాలు మార్పునకు నోచుకుంటాయి.. ఎన్నో ఇళ్ళు విద్యుత్ వెలుగులతో కాంతులీనుతాయి. ఇంతకీ ఐపీఎల్ లో ఆ జట్టు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం వల్ల ఎందుకు పేదల ఇళ్ళు కాంతివంతం అవుతాయో.. ఈ కథనంలో తెలుసుకుందాం.
ఐపీఎల్ 17వ సీజన్లో కోల్ కతా తో పాటుగా రాజస్థాన్ జట్టు అప్రతిహత విజయాలు సాధిస్తోంది.. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ విజయాలు సాధించి.. రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు శనివారం రాత్రి బెంగళూరు జట్టుతో తలపడుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు ఆటగాళ్లు మొత్తం పింక్ ప్రామిస్ అనే పేరుతో పూర్తిగా గులాబీ రంగులో రూపొందించిన జెర్సీలను ధరించారు. ఆ జెర్సీల వెనుక ఒక మంచి నిర్ణయం దాగుంది.
రాజస్థాన్ జట్టు తీసుకున్న నిర్ణయమే ఈ పింక్ ప్రామిస్. ఈ పింక్ ప్రామిస్ వల్ల అనేక పేద కుటుంబాలో విద్యుత్ వెలుగులు ప్రసరించనున్నాయి. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. దీనిని పూర్తిగా మహిళలకు అంకితం ఇచ్చారు. దీనికి పింక్ ప్రామిస్ అనే పేరు పెట్టారు. ఇందులో భాగంగా రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్, రాజస్థాన్ ఫౌండేషన్ కలిసి.. ఓ ప్రజోపయోగ కార్యక్రమాన్ని చేపడతాయి. దీని ప్రకారం బెంగళూరు, రాజస్థాన్ జట్ల మధ్య నమోదయ్యే ప్రతి సిక్స్ కు బదులుగా.. ఆరు పేద ఇళ్లకు ఉచితంగా సోలార్ ప్యానల్స్ బిగిస్తారు. వాటి ద్వారా ఆ గృహాలకు ఉచితంగా సౌర విద్యుత్ అందిస్తారు. ఇలా మ్యాచ్ లో నమోదయ్యే ఒక్కో సిక్స్ కు ఆరేసి ఇళ్లకు ఉచితంగా సౌర విద్యుత్తు ప్యానెల్స్ బిగిస్తారు.
రాజస్థాన్ రాష్ట్రం పూర్తి ఎడారి ప్రాంతం. ఇక్కడ థర్మల్ విద్యుత్ అంతంతమాత్రంగానే ఉంటాయి. అక్కడక్కడ గాలి మరల ద్వారా విండ్ పవర్ ఉత్పత్తి చేస్తారు. అయితే ఈ విద్యుత్తు అన్ని గ్రామాలకు సరిపోదు.. అందుకే రాజస్థాన్ రాయల్స్ ఈ నిర్ణయం తీసుకుంది.. బెంగళూరు తో జరిగే మ్యాచ్ లో 20 సిక్స్ లు నమోదయ్యాయనుకుంటే.. 20×6 చొప్పున 120 ఇళ్లపై ఉచితంగా సోలార్ ఫ్యానల్స్ ఏర్పాటు చేస్తారు. ఇది మాత్రమే కాకుండా రాజస్థాన్ జట్టు ఆడే స్పెషల్ పింకీ జెర్సీలను అమ్మగా, మ్యాచ్ టికెట్లను విక్రయించగా వచ్చిన డబ్బులో కొంత భాగం విరాళంగా ఇస్తారు. అంటే ఒక్కో టికెట్ పై వంద రూపాయల వరకు విరాళంగా ఇస్తారు.. పూర్తిగా వెనుకబడిన రాజస్థాన్ రాష్ట్రంలోని పేద మహిళల ఆర్థిక సాధికారత కోసం ఈ డబ్బులను ఖర్చు చేస్తారు. రాజస్థాన్ జట్టు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రేక్షకుల నుంచి అభినందనలు వెలువడుతున్నాయి. మహిళల సాధికారత కోసం ఇంతలా కష్టపడుతున్న రాజస్థాన్ జట్టుకు తాము సపోర్ట్ చేస్తున్నామని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. రాజస్థాన్ రూపొందించిన పింక్ జెర్సీలను కొనుగోలు చేసి.. ఫోటోలు దిగి రాజస్థాన్ రాయల్స్ అఫీషియల్ సోషల్ మీడియా ఎకౌంట్ కు ట్యాగ్ చేస్తున్నారు.