కేసీఆర్ ఏడేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని 2014లో ఎన్నికల మ్యానిఫెస్టోలో పేజ్ నెం. 7లో మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఈ 7 సంవత్సరాల కాలంలో ఏ ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించారో మీరు వివరాలు అందించగలరా అని డిమాండ్ చేశారు. నిజాం షుగర్స్ ను పునరుద్ధరించాలని టీఆర్ఎస్ భావిస్తున్నది అని 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పేజ్ నెం.23లో పేర్కొన్నారు.
ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేసి చెరకు రైతులను ఎప్పుడు ఆదుకుంటారు? నిజామాబాద్ జిల్లాలో చెరకు పరిశోధన కేంద్రం, పాలమూరు జిల్లాలో చేపల పరిశోధన కేంద్రం ఏర్పాటుకు టీఆర్ఎస్ కట్టుబడి ఉందని మీ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోల పేజ్ నెం.11లో హామీ ఇచ్చారు. ఈ పరిశోధన కేంద్రాల ఏర్పాటు ఎక్కడి వరకు వచ్చాయి? కొత్తగా 10 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ప్రారంభిస్తామని 2014 ఎన్నికల మ్యానిఫెస్టోల పేజ్ నెం.8లో మీరు హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎన్ని థర్మల్ విద్యుత్కేంద్రాలు ప్రారంభించారు? కనీసం ఒక్క యూనిట్ అయినా కొత్తగా ఉత్పాదన చేశారా అని ప్రశ్నించారు.
మిషన్ కాకతీయను కమిషన్ కాకతీయగా మార్చి కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని మీ పార్టీ వారు దోచుకోలేదా? దీనిపైనా జ్యూడిషల్ ఎంక్వయిరీకి మీరు సిద్ధమా? మిషన్ కాకతీయ కార్యాక్రమంలో కమిషన్ల కోసం ప్రాధాన్యం లేని చెరువులకు పనులు చేపట్టారని ‘కాగ్’ తప్పుపట్టిన మాట వాస్తవం కాదా? కమ్యూనిటీ బేసెడ్ ట్యాంక్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం కింద తీసుకున్న చెరువులనే తిరిగి మిషన్ కాకతీయలో చేపట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీ పార్టీ వారు దోచుకున్నారని ‘కాగ్’ తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్న విషయం మీ దృష్టికి వచ్చిందా? దీనిపై మీరు ఏం చర్యలు తీసుకున్నారు అని అన్నారు.
‘‘జలయజ్ఞం-ధనయజ్ఞం’’గా గతంలో అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ రాజేశేఖర రెడ్డి గారు వాటిపై ఆయా ప్రాజెక్టులు వద్ద అఖిలపక్షం నేతలతో, నిపుణులతో చర్చా కార్యక్రమాలు నిర్వహించి, వారి ముందు అన్ని ఫైల్స్ ఉంచి అనుమానాలను నివృత్తి చేశారు.. మీరు కూడా సాగునీటి ప్రాజెక్టులలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై అటువంటి కార్యక్రమం నిర్వహించే దమ్మూ, ధైర్యం ఉందా? నిలదీశారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై మీకు సోయి ఉందా? దీనిపైన తెలంగాణ శాఖ మీకు అనేక సార్లు ఫిర్యాదు చేసింది… ఈ అక్రమ ప్రాజెక్టులు ఆపడానికి మీరు ఏమి చర్యలు తీసుకొన్నారు? కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా 299 టీఎంసీలు నీటి వాటాకు ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రానికి మీరు తీరని ద్రోహం చేసిన మాట వాస్తవం కాదా? ఏపీ నిర్మిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులకు మీరు పరోక్షంగా సహాయ, సహకారాలు అందిస్తున్నారా? లేదా? మీ ఆత్మసాక్షిగా నిజం చెప్పండి?
తెలంగాణ నీటిని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోచుకుపోతుంటే మీరు తీసుకున్న చర్యలు ఏమిటి అని ప్రశ్నించారు.
2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి బోర్లు, కాలువలు క్రింద సాగులో వున్నది ఎంత? ఈ 7 సంవత్సరాల కాలంలో మీరు అధికారం చేపట్టిన తరువాత కాలువలు, బోర్లు క్రింద సాగులోనికి వచ్చిందెంత? వాటి వివరాలు ఇవ్వగలరా? రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని 2014, 2018 ఎన్నికల్లో మీరిచ్చిన హామీ ఎంతమేరకు నెరవేర్చారు? మాకున్న సమాచారం ప్రకారం ఇంకా 39 లక్షల మంది రైతులకు 27వేల 500 కోట్ల రూపాయలు మాఫీ చేయాల్సి ఉంది. ఈ హామీని ఎప్పటిలోగా మీరు నెరవేరుస్తారు? మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ 7 సంవత్సరాల కాలంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు ఎంత నష్ట పరిహారం చెల్లించారు?
రాష్ట్రంలో ఇప్పటికే 28వేల 500ల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మీ అసమర్థ పాలన వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి మీ సమాధానమేంటి? అని అడిగారు.