KCR
KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి పది నెలలు పూర్తయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 65 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక అధికార బీఆర్‌ఎస్ 39 సీట్లకు పరిమితమైంది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఫామ్‌హౌస్‌లో కాలుజారి పడడంతో తుంటి విరిగింది. ఆపరేషన్ తర్వాత మూడునాలుగు నెలలు బెడ్‌కే పరిమితమయ్యారు. లోక్‌సభ ఎన్నిలవేళ మూడు నెలల క్రితం కేసీఆర్ ప్రచారం కోసం చేతికర్రసాయంతో తెలంగాణ భవన్‌కు వచ్చారు. పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. బస్సు యాత్ర చేపట్టారు. కానీ, కేసీఆర్ ఆశించిన ఫలితం రాలేదు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌కు క్యూ కడుతున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మేల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. అనేక మంది నేతలు కూడా హస్తం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ అధినేత బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.
కాంగ్రెస్ వైఫల్యం..
ఇదిలా ఉంటే.. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హామీల అమలుకు ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటే పూర్తిగా అమలవుతోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొంత మందికే చేరుతోంది. రూ.500 సిలిండర్ కూడా అర్హులందరికీ అందలేదు. ఇక రూ.2 లక్షల రుణమాఫీ హామీ పూర్తిగా నెరవేరలేదు. ఇప్పటికీ 30 శాతం రైతులకు రుణాలు మాఫీ కలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీలు ఇంకా అమలు కాలేదు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన తొలి నోటిఫికేషన్ డీఎస్సీ. పరీక్ష నిర్వహించి రెండు నెలలు గడిచినా ఫలితాలు ప్రకటించలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పరీక్ష నిర్వహించిన ఉద్యోగాల ఫలితాలు ప్రకటించి నియామక ఉత్తర్వులు ఇచ్చి.. తామే చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో అన్నివర్గాల్లో క్రమంగా కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరుగుతోంది.
హైదరాబాద్ వాసుల్లో ఆగ్రహం..
ఇక హైదరాబాద్ వాసుల్లో అయితే ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ముఖ్యంగా హైడ్రా బాధితులు, మూసీ ప్రక్షాళన కారణంగా బలవంతంగా ఇళ్లను ఖాళీ చేస్తున్న బాధితులు కాంగ్రెస్ సర్కార్‌పై మండి పడుతున్నారు. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డిపైనే మండిపడుతున్నారు. ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నారు. ఉన్నఫలంగా వెళ్లిపోమంటే ఎక్కడకి వెళ్లాలని మండిపడుతున్నారు. దీని ప్రభావం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్న రైతులు..
ఇదిలా ఉంటే.. గ్రామాల్లో రైతులు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. రుణమాఫీ హామీ నెరవేరకపోగా.. రైతుబంధు ఆగిపోయింది. రైతుభరోసా కింద పంటకు రూ.7,500 ఇస్తామని చెప్పిన రేవంత్ మాట నిలబెట్టుకోలేదు. వానాకాలం పంట పూర్తికావొస్తున్నా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇక వర్షాలు, వరదలు, తెగుళ్లతో పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అప్పులు ఎలా తీర్చాలని, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండె అని తలుచుకుంటున్నారు. వృద్ధులు కూడా పింఛన్ రూ.4 వేలు అవుతుందనంటే కాంగ్రెస్‌కు ఓటేశామని చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి గెలిచి ఏడాది కావొస్తున్నా పింఛన్ పెరగలేదని పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌నే గెలిపించుకుంటామని మాట్లాడుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను రైతులు తలుచుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. రేవంత్‌రెడ్డి కూల్చివేతలతో ఎప్పుడైనా ఇలా తలుచుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చినంక కష్టాలు వస్తున్నాయని.. కేసీఆరే రావాలని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
View Author's Full InfoWeb Title: Videos of farmers touching former cm kcr are going viral on social media