Online Mobile Game: యువకుల్లారా.. ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారా.. అవన్నీ నిజం కాదు. ఆ గేమ్స్ అన్నీ మిమ్మల్ని సర్వం దోచుకునే సైబర్ నేరగాళ్ల ఆయుధాలు. ఒక్కసారి ఆ ఊబిలో దిగారా… ? మీరు సర్వస్వం కోల్పోవడమే కాదు. చివరికి జీవితాల్నీ కోల్పోవాల్సివస్తుంది. జాగ్రత్త’ అని చెబుతున్నాడు జార్ఖండ్ కి చెందిన ఒక ఆన్లైన్ గేమింగ్ బాధితుడూ, ఈ వ్యసనానికి లోనై రూ.96 లక్షలు పోగొట్టుకున్న హిమాన్షు మిశ్రా..
■ యూట్యూబర్ పాడ్ కాస్ట్ లో కన్నీటి పర్యంతమైన హిమాన్షు మిశ్రా:
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల హిమాన్షు మిశ్రా ఆన్లైన్ గేమింగ్ వ్యసనానికి లోనై బెట్టింగుల్లో రూ.96 లక్షలు కోల్పోయాడు. ఈ వ్యసనానికి లోనై తన జీవితాన్ని నాశనం చేసుకున్నానని, అమ్మానాన్న, తొడబుట్టిన వాళ్లు దూరమయ్యారని, స్నేహితులూ దగ్గరకు రావడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రముఖ యూ ట్యూబర్ షాలినీ కపూర్ కి ఇచ్చిన పాడ్కాస్ట్ లో హిమాన్షు తన వేదనని వెలిబుచ్చాడు.
చదువు లో తాను ఎంతో చురుకైనవాడినని చెప్పిన హిమాన్షు ఐఐటీ, జేఈఈ లో 98 శాతం మార్కులు సాధించానని చెప్పుకొచ్చాడు. తొలుత సరదాగా ఆన్లైన్లో గేమ్ ఆడడం మొదలుపెట్టానని, మొదట్లో ఎలాంటి బెట్టింగ్స్ లేని ఫ్రీ యాప్స్ లోనే ఆడేవాడినని, మెల్లగా అతి తక్కువ బెట్టింగుల్లోకి దిగానని వెల్లడించాడు. తొలుత రూ.49 బెట్టింగ్ తో ప్రారంభించానని చెప్పాడు. మొదట్లో తనకి లాభాలే చూపించారని, క్రమంగా తానూ బానిసయ్యానని చెప్పుకొచ్చాడు. తన చదువుకోసం, ఫీజుల కోసం ఇచ్చిన డబ్బు కూడా ఈ ఆన్లైన్ గేమ్ లలో పెట్టానని తెలిపాడు. ఇంట్లో తల్లిదండ్రుల వద్ద, స్నేహితుల వద్ద, బంధువుల వద్ద, పరిచయస్థుల వద్ద .. కనిపించిన వారివద్దనల్లా అప్పులు చేసి మరీ ఆన్లైన్ బెట్టింగ్ వేశానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మొత్తం రూ.96 లక్షల వరకు కోల్పోయానని , అప్పులబాధ తట్టుకోలేక అమ్మా,నాన్న ఇంటికే రావద్దని గెంటేశారని, తనతో స్నేహితులు, బంధువులు ఎవరూ మాట్లాడం లేదని వేదన చెందాడు. ఇప్పుడు కొత్త జీవితం మొదలు పెట్టానని , తన జీవితాన్ని గుణపాఠం గా తీసుకుని ఎవరూ ఆన్లైన్ గేముల జోలికి వెళ్లవద్దని హిమాన్షు పాడ్ కాస్ట్ లో సూచించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
■ ఆన్లైన్ గేమ్స్ అన్నీ ఫేక్ అంటున్న పోలీసులు:
ఆన్లైన్ గేమ్స్ ఏవీ నిజమైనవి కాదని అవన్నీ సైబర్ నేరగాళ్లు సృష్టించే దోపిడీ సాధనాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యువత , బాగా చదువుకున్న వాళ్లే వీటి బారినపడి కోట్లాది రూపాయలు కోల్పోవడం బాధాకరమని అంటున్నారు. ఈజీ మనీ కోసం వెంపర్లాట వద్దని, దురాశ దుఃఖాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. ఆన్లైన్ గేమింగ్ యాప్స్ వేటినీ కూడా డౌన్ లోడ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ నిర్వహుకులు అంతా సైబర్ నేరగాళ్లని, దుబాయ్, నైజీరియా వంటి ఇతర దేశాల నుంచి వీటిని నిర్వహిస్తూ అమాయకులను దోచుకుంటున్నారని వెల్లడిస్తున్నారు.
■ ఆన్లైన్ గేమింగ్ లో కోట్లు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్లు ఎందరో…
ఈ ఆన్లైన్ గేమింగ్ కి బానిసలుగా మారి , ఆ ఊబిలో కూరుకుపోయి కోట్ల రూపాయలు కోల్పవడమే కాదు… వత్తిడి, అవమానం తట్టుకోలేక చివరికి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు దేశంలో రోజూ ఏదో ఒకచోట జరుగుతుండడం ఈ ఆన్లైన్ గేమింగ్ భూతం దేశ యవతని ఎలా పట్టి పీడిస్తుందో అర్ధం చేస్కోవచ్చు. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఒక వ్యాపారి కుమారుడు ఇలాగే ఆన్లైన్ బెట్టింగులలో రూ.3 కోట్ల వరకు కోల్పోయాడు. తల్లి దండ్రులు మందలించడంతో రెండు నెలల క్రితం సాగర్ కాల్వలో దూకి ఆత్మహత్య చేస్కోవడం అందరినీ కలచివేసింది.
■ చైతన్యమే పరిష్కారం: ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్, సైబర్ నేరాలపై యువతకి, విద్యార్థులకు, ఉద్యోగులకు పూర్తి అవగాహన రావాల్సి ఉందని, ఇవన్నీ మోసాలేననే పూర్తి అవగాహన వస్తే తప్ప వీటిబారిన పడకుండా వుండలేరని పోలీసులు చెబుతున్నారు. వీటిపై ప్రజలకి అత్యంత ఎక్కువగా అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు, సెలబ్రిటీలు తమ సందేశాల్లో వీటి జోలికి యువత వెళ్లవద్దని సందేశం ఇవ్వాలని కోరుతున్నారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read More