https://oktelugu.com/

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి.. పచ్చబ్యాచ్ కు కట్టుబానిస అయ్యారా?

ప్రస్తుతం త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్నాయి. అయితే అందులో ఒకటి తెలంగాణ ప్రాంతానికి చెందినది కావడం.. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలిగినది కావడంతో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : January 10, 2024 2:36 pm
    CM Revanth Reddy
    Follow us on

    CM Revanth Reddy: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత గోప్యంగా ఉండాల్సిన విషయాలన్నీ బయటికి వస్తున్నాయి. పెద్ద మనుషుల అంతర్గత వ్యవహారాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా ఇవి వారిలో ఉన్న అసలు కోణాన్ని ప్రజలకు బట్టబయలు చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇలాంటివి తరచుగా వెలుగు చూడడం సాధారణం అయినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇలాంటివి నిరాటకంగా జరిగిపోతున్నాయి. సామాజిక మాధ్యమాల వినియోగం తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఇలాంటివి తెరపైకి రావడం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో మాటలు, ప్రతి మాటలు సర్వసాధారణమైపోతున్నాయి. ప్రస్తుతం త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్నాయి. అయితే అందులో ఒకటి తెలంగాణ ప్రాంతానికి చెందినది కావడం.. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలిగినది కావడంతో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

    తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రజ్యోతి పత్రిక భారీగానే స్పేస్ కేటాయించింది. పైగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన వ్యక్తి అనే ముద్ర పడటం.. రేవంత్ రెడ్డిని ఆంధ్రజ్యోతి పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ పలుమార్లు ఇంటర్వ్యూ చేయడం.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సందర్భంగా రేవంత్ రెడ్డి పలు విషయాలపై రాధాకృష్ణతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కొన్ని విషయాల్లో కుండబద్దలు కొట్టారు. కెసిఆర్ పై సుతి మెత్తగా విమర్శలు చేస్తూనే.. తన జోలికి వస్తే ఖబడ్దార్ అనే హెచ్చరికలు కూడా జారీ చేశారు.. రాధాకృష్ణ ఇంటర్వ్యూకి రావడం పట్ల రేవంత్ రెడ్డి తీరుపై ఓ వర్గం విమర్శలు చేస్తున్నది. ఆ వర్గంలోని సభ్యులు సామాజిక మాధ్యమాల వేదికగా ఒక వీడియోను చర్చనీయాంశం చేస్తున్నారు.

    ఏదో ఒక హోటల్లో మీటింగ్ జరగడం.. ఆ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ హాజరు కావడం.. సమావేశం అనంతరం రాధాకృష్ణను కారు డోరు తీసి అందులో రేవంత్ రెడ్డి కూర్చోబెట్టడం.. ఆ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రతిపక్ష టీడీపీకి ఆంధ్రజ్యోతి విపరీతమైన కవరేజ్ ఇస్తోంది. జగన్మోహన్ రెడ్డిని నేరుగానే విమర్శిస్తోంది. గతంలో అంతర్గతంగా టిడిపికి సపోర్ట్ ఇచ్చిన ఆంధ్రజ్యోతి.. ప్రస్తుతమయితే నేరుగానే టిడిపిని మోస్తోంది. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడ్డగోలుగా వార్తలు రాస్తున్నది. అయితే ఇటీవల వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఫోన్ చేసి కూడా శుభాకాంక్షలు చెప్పలేదని రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు. ఇది సహజంగానే వైసీపీ క్యాంపుకు ఇబ్బంది కలిగించింది.

    దీంతో ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియాకు సంబంధించిన కొందరు పాత వీడియోలను బయటకు తీస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి, ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ పాల్గొన్న ఒక కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం తెర పైకి తెస్తున్నారు. ఆ వీడియోలో రేవంత్ రెడ్డి కారు డోర్ ఓపెన్ చేసి రాధాకృష్ణను దగ్గరుండి అందులో కూర్చోబెట్టారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందే ఈ కార్యక్రమం జరిగినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దానిని అత్యంత వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకురావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో చూసిన చాలా మంది రేవంత్ రెడ్డి పచ్చ బ్యాచ్ కు కట్టు బానిస అయ్యారా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వీడియో పాతది అని, కొంతమంది ఇప్పుడు పోస్ట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక పత్రికాధిపతిని కార్లో కూర్చోబెడితే నెగిటివ్ గా చూడాల్సిన అవసరం ఏముందని టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు. అయితే వైసిపి సోషల్ మీడియా విభాగం వారికి భారత రాష్ట్ర సమితి నాయకులు మద్దతుగా మాట్లాడటం ఇక్కడ కొసమెరుపు.