WhatsApp Group: వారెవ్వా వాట్సాప్‌.. ఎంత మేలు చేసింది!

WhatsApp Group వేములవాడ చారిటబుల్‌ ట్రస్టు వాట్సాప్‌ గ్రూపు వెయ్యి రోజులుగా స్థానిక రాజరాజేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో ఉండే అన్నార్థులు, అభాగ్యులు, నిరుపేదలు, అనాథల ఆకలి తీరుస్తోంది.

Written By: Raj Shekar, Updated On : February 2, 2024 12:19 pm

WhatsApp Group

Follow us on

WhatsApp Group: వాట్సప్‌.. ఒక సమాచార వేదిక.. ఒక ఎంటర్‌టైన్మెంట్‌.. బాధను, ఆనందాన్ని పంచుకునే వేదిక.. ఆత్మీకులను ప్రత్యక్షంగా చూసుకునే సమాచార మాధ్యమం. ఇప్పుడు సేవా కార్యక్రమాలకు నిలయంగా కూడా మారింది. ఒకప్పుడు చిన్న వాట్సాప్‌ గ్రూపుగా ఏర్పడిన మిత్రులు వారి స్నేహితుల యోగక్షేమాలు తెలుసుకుంటూ అభాగ్యులు, నిరుపేదలు, ఆపదలో, కష్టాల్లో ఉన్నవారికి సహాయం అందించేలా చేసింది. ఆ చిన్న వాట్సాప్‌ గ్రూపు కాస్తా.. మై వేములవాడ చారిటబుల్‌ ట్రస్ట్‌గా మారింది.

అన్నార్థుల ఆకలి తీరుస్తూ..
వేములవాడ చారిటబుల్‌ ట్రస్టు వాట్సాప్‌ గ్రూపు వెయ్యి రోజులుగా స్థానిక రాజరాజేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో ఉండే అన్నార్థులు, అభాగ్యులు, నిరుపేదలు, అనాథల ఆకలి తీరుస్తోంది. పేద యువతీ, యువకుల చదువుల కోసం ఖర్చు అందిస్తోంది. ఆస్పత్రిలో చేరిన పేదలకు వైద్య సాయం కోసం ఆర్థికసాయం అందిస్తోంది. ఈ ట్రస్టు ద్వారా నిర్విరామంగా, నిర్విఘ్నంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ట్రస్ట్‌ సభ్యులు మధు మహేశ్, గొంగిళ్ల రవి తెలిపారు.

కరోనా సమయంలో గ్రూప్‌..
కరోనా విపత్తు సమయానికి కొన్ని నెలల ముందు ఈ వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేశారు కుంట అనిల్‌కుమార్, మిత్రుల సహకారంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కరోనా సమయంలో ట్రస్టు ద్వారా వైరస్‌ బారిన పడిన వారికి, లాక్‌డౌన్‌లో ఆకలితో అలమటించినవారికి అండగా నిలిచారు. మై వేములవాడ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎవరికైనా సాయం కావాలనుకుంటే తమను సంప్రదించాలని సభ్యులు కోరుతన్నారు. దాతలు తమతో కలిసి వస్తే వారిని కూడా ట్రస్టులో భాగస్వాములను చేసుకుంటామని చెబుతున్నారు.

దాతల సహకారం..
ట్రస్టు సేవల గురించి తెలుసుకున్న చాలా మంది వేములవాడ పట్టణవాసులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తమ వివాహ వేడుకలు, శుభకార్యాలు, పుట్టిన రోజు, యనివర్సరీలు ఏ శుభకార్యమైన మై వేములవాడ చారిటబుల్‌ ట్రస్ట్‌ వద్దకు చేరుకొని జరుపుకుంటున్నారు. అభాగ్యులకు, నిరుపేదలకు, రాజన్న భక్తులకు ఆహారాన్ని అందిస్తున్నారు.