VC Sajjanar: తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు బీఆర్‌ఎస్ హయాంలో లా అండ్ ఆర్డర్ చాలా కట్టుదిట్టంగా, అదుపులో ఉండేదన్న పేరు బలంగా వినిపించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, పోలీసు శాఖను బలోపేతం చేయడానికి మంచి వాహనాలు, బైక్‌లు, స్కూటీలు, పెద్ద ఎత్తున పోలీస్ నియామకాలు చేపట్టడం ద్వారా శాంతిభద్రతలను ఒక లైన్‌లో పెట్టారన్న అభిప్రాయం ఉంది. చాలామంది సమర్థులైన పోలీసు అధికారులను కీలక స్థానాల్లో నియమించడం వల్లనే హైదరాబాద్‌కు పెట్టుబడులు రావడానికి దోహదపడిందనే పేరు కూడా దక్కింది.
కాంగ్రెస్ హయాంలో పెరిగిన విమర్శలు
అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం హైదరాబాద్‌తో సహా తెలంగాణ వ్యాప్తంగా శాంతిభద్రతలు గాడి తప్పాయన్న విమర్శలు తీవ్రమయ్యాయి. హైదరాబాద్‌లో పట్టపగలు హత్యలు, దొమ్మీలు, దోపిడీలు జరిగాయని, హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
కీలక నియామకాలతో నూతన ఉత్సాహం
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీస్ శాఖలో రెండు కీలక నియామకాలను చేపట్టింది. ఒకప్పటి స్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ శివధర్ రెడ్డిని రాష్ట్ర డీజీపీగా నియమించారు. అదే విధంగా రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్గా, కఠిన అధికారిగా పేరున్న సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండీ బాధ్యతల నుంచి తప్పించి, కీలకమైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ)గా నియమించారు.
ఈ ఇద్దరు కఠిన అధికారుల నియామకంతో తెలంగాణ పోలీస్ శాఖలో నూతన ఉత్సాహం నెలకొంది.
సజ్జనార్‌పై భారీ విశ్వాసం
ముఖ్యంగా, చాలా స్ట్రిక్ట్‌గా, సూటిగా వెళ్లే అధికారిగా పేరున్న వీసీ సజ్జనార్ హైదరాబాద్ లా అండ్ ఆర్డర్‌ను ఖచ్చితంగా సెట్ రైట్ చేస్తారని, తెలంగాణలో శాంతిభద్రతలు మళ్లీ మెరుగుపడతాయని ప్రజలు, అధికార వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన కఠిన నిర్ణయాలు, తక్షణ చర్యలు నగరంలో నేరాల నియంత్రణకు, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచడానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.
శివధర్ రెడ్డి డీజీపీగా, సజ్జనార్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిలో గణనీయమైన మార్పులు రావాలని, ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ పెట్టుబడులకు, సాధారణ ప్రజలకు మరింత సురక్షితమైన నగరంగా మారాలని ప్రజలు కోరుకుంటున్నారు.