https://oktelugu.com/

Exit Polls: డిబేట్ల వరకే టీవీ9.. ఎగ్జిట్ పోల్స్ లో కాదు.. బీఆర్ఎస్ కు బిగ్ షాక్

హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఎంఐఎం గెలిచే అవకాశం ఉందని.. ఇదే సమయంలో గత అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి కూడా ఒకే స్థానానికి పరిమితం అయ్యే అవకాశం ఉందని తేల్చి చెప్పింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 2, 2024 / 07:17 AM IST

    Exit Polls

    Follow us on

    Exit Polls: పార్లమెంటు ఎన్నికల సమయంలో కెసిఆర్ బయటకు వచ్చారు. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బయటికి వచ్చినప్పటికీ.. టీవీ చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. కానీ ఈసారి అందుకు భిన్నంగా జనంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయిన తర్వాత తొలిసారిగా టీవీ9 రజినీకాంత్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ తర్వాత ఏబీఎన్ మినహా మిగతా అన్ని చానల్స్ కూ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనాల మూడ్ మారుతోందని.. కచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి గెలుస్తుందనే సంకేతాలను కేసీఆర్ ఇచ్చారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇవి ఎంతవరకు నిజమోనని తెలుసుకొనేందుకు టీవీ9 ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వే నిర్వహించింది. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలలో ఓటర్ల నాడిని పసిగట్టేందుకు సర్వే చేపట్టింది.

    టీవీ9 చేపట్టిన ఆ సర్వేను ఎగ్జిట్ పోల్స్ రూపంలో శనివారం సాయంత్రం బయటపెట్టింది. ఈ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉండగా.. హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఎంఐఎం గెలిచే అవకాశం ఉందని.. ఇదే సమయంలో గత అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి కూడా ఒకే స్థానానికి పరిమితం అయ్యే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. ఇక మిగతా స్థానాలలో దాదాపు ఎనిమిదింట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. భారతీయ జనతా పార్టీ ఏడు స్థానాలలో గెలుపొందే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాలలో విజయం సాధించింది. ఈసారి మరో మూడు స్థానాలను పెంచుకుంటుందని టీవీ9 స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా గత ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుచుకుంది. భారత రాష్ట్ర సమితి 9 స్థానాలలో విజయం సాధించింది.

    అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా తారు మారయింది. భారత రాష్ట్ర సమితి గెలుచుకున్న తొమ్మిది స్థానాలలో.. 8 స్థానాలను కాంగ్రెస్, బిజెపి పంచుకున్నాయి. టీవీ9 ఎగ్జిట్ పోల్స్ ప్రకారం భారతీయ జనతా పార్టీకి మూడు స్థానాలు అదనంగా వస్తుండగా.. కాంగ్రెస్ పార్టీకి ఐదు స్థానాలు ఎక్కువ వస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి మెదక్ లేదా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, చేవెళ్ల స్థానాలలో గెలుపొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, నల్లగొండ, భువనగిరి, పెద్దపల్లి, జహీరాబాద్, సికింద్రాబాద్ లో గెలిచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కాగా టీవీ 9 ఎగ్జిట్ పోల్స్ భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి పెద్దలకు చెందిన వారు గతంలో టీవీ9 ఛానల్ కొనుగోలు చేశారు. భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష స్థానానికి పడిపోయినప్పుడు.. తిరిగి జనంలో మైలేజ్ తెచ్చేందుకు రకరకాల కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అయినప్పటికీ భారత రాష్ట్ర సమితి పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకోలేదు. గత ఎన్నికల్లో 9 స్థానాలు సాధించిన ఆ పార్టీ.. ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావడం పట్ల విస్మయం వ్యక్తమౌతోంది.