
ఎరక్కపోయి ఏడాది కిందట ఇరుక్కున్నాడు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్. మీడియా చేతిలో ఉంది కదా అని అప్పటిదాకా ప్రభుత్వాలనే శాసించిన రవిప్రకాష్ అనవసరంగా సీఎం కేసీఆర్ తో పెట్టుకొని తన పతనాన్ని తానే రాసుకున్నాడనే చర్చ మీడియా సర్కిల్స్ లో సాగుతుంటుంది. తెలంగాణ ప్రభుత్వం గద్దెనెక్కగానే ఎమ్మెల్యేల ప్రమాణంపై వ్యంగ్యాస్త్రాలు వేసినందుకు ఏబీఎన్ తోపాటు టీవీ9ను నిషేధించారు కేసీఆర్. ఆ పగను మనసులో పెట్టుకొని ఎన్నడూ స్క్రీన్ మీదకు రాని టీవీ9 రవిప్రకాష్ నాడు తెలంగాణలో బయటపడ్డ ఇంటర్ పరీక్షల లీకేజీపై పెద్ద దుమారం రేపాడు. నాడు విద్యార్థుల తల్లిదండ్రులను హైలెట్ చేసి రచ్చచేయడం గులాబీ వర్గాల్లో ఆగ్రహానికి కారణమైందట.. దీంతో సీఎం కేసీఆర్ కు టార్గెట్ గా మారాడని.. ఆయన ఆడిన ఆటలో టీవీ9 రవిప్రకాష్ అరటిపండుగా మారాడని జర్నలిస్ట్ సర్కిల్స్ లో చెబుతుంటారు.
రవిప్రకాశ్.. టీవీ9 కేంద్రంగా బ్రేకింగ్ న్యూస్.. బిగ్ న్యూస్‌లకు ప్రాధాన్యమిచ్చిన ఆయన.. ఇప్పుడు ఆయనే న్యూస్ అవుతున్నాడు. ఇప్పటికే ప్రభుత్వాలకు టార్గెట్ అయిన ఆయన.. మరో ప్రయోగానికి తెరలేపుతున్నట్లు తెలుస్తోంది. హ్యాష్ట్యాగ్ యూ (HashtagU) పేరుతో న్యూస్ చానల్ ప్రారంభిస్తున్నట్లుగా ప్రచారం. గతంలో రవిప్రకాశ్‌తో కలిసి పనిచేసిన వారిని.. ఆయన అనుయాయులను కూడా టీవీ9 యాజమాన్యం ఒక్కొక్కరిని పక్కన పెట్టేయగా.. ఆ టీంలో పనిచేసిన వారంతా ఇప్పుడు హాష్ ట్యాగ్ యూని ట్రెండింగ్ చేసే పనిలో ఉన్నారు.
టీవీ9 నుంచి బయటికి పంపించినప్పటి నుంచి ఏదో ఒక మీడియా హౌజ్ నుంచి రీ ఎంట్రీ కోసం రవిప్రకాశ్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ.. పరిస్థితులు ఆయనకు కలిసిరావడం లేదు. ఈ క్రమంలోనే హ్యాష్ట్యాగ్ యూ పేరుతో కొత్త చానల్ ప్రారంభిస్తున్నారని ప్రచారం జరుగుతున్నా అందులో వాస్తవం లేదనేది తెలుస్తోంది. ఎందుకంటే హ్యాష్ ట్యాగ్ యూ అనేది దినేష్ ఆకుల ప్రారంభిస్తున్న యాప్ అని సమాచారం. ఇటీవల న్యూస్ యాప్‌లకు మంచి ఆదరణ వస్తుండడంతో మీడియాలో మంచి అనుభవం ఉన్న దినేష్ దీని మీద దృష్టి పెట్టారు. ఈ దినేష్ గతంలో రవి ప్రకాశ్ టీంలోనే పనిచేశాడు. అంతకుముందు హిందీ మీడియాలో సుదీర్ఘ అనుభవం ఉంది.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దినేష్ ఆకులకు ఢిల్లీ స్థాయిలో గుర్తింపు ఉన్నా.. అనూహ్యంగా తెలుగు మీడియా రంగంలోకి ప్రవేశించారు. ముందుగా టీవీ9, తర్వాత టీవీ5లో పనిచేశారు. టీవీ9 కన్నడ చానల్ ప్రారంభించాక ఆ వ్యవహారాలన్నీ ఆయనే చూశారు. కొద్ది కాలానికే ఆయన టీవీ5ని కూడా వీడారు. ప్రస్తుతం ఢిల్లీలో ఓ సంస్థ కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ హ్యాష్ ట్యాగ్ యూ పేరుతో తెరమీదకు వస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. దీనికి వెనకాల నుంచి రవిప్రకాశ్ సపోర్ట్ ఏమైనా ఉందా అని మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది.