Viral Video : చర్చ పక్కనపెడితే.. జీవన్ రెడ్డి, బండ్లగణేష్ లను రెచ్చగొట్టి కామెడీ పండించిన టీవీ9 రజినీకాంత్.. వీడియో వైరల్

ఇప్పుడంటే రజనీకాంత్ టీవీ9 ప్రైమ్ టైం డిబేట్లో కనిపించడం లేదు. తెర వెనుక ఎన్నో కారణాలు, ఒత్తిళ్లు రావడంతో ఆయనను కొంతకాలంగా టీవీ9 మేనేజ్మెంట్ ప్రైమ్ టైం డిబేట్లకు దూరంగా ఉంచుతోంది. రుధిరం దేవి, దీప్తితోనే ప్రైమ్ టైం బండి లాగిస్తోంది. మేనేజ్మెంట్ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ.. రజనీకాంత్ లేని ప్రైమ్ టైం షో చప్పిడి వంటకంలాగా ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 22, 2024 9:49 pm

Viral Video

Follow us on

Viral Video :  రజనీకాంత్ ప్రైమ్ టైం డిబేట్ కు దూరంగా ఉన్నప్పటికీ.. ఆయన అభిమానులు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో రజనీకాంత్ గతంలో చేసిన ప్రైమ్ టైం డిబేట్ లకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. అలా వైయస్ జగన్ అభిమానులు ఎప్పటిదో పాత వీడియోలను అప్లోడ్ చేసి.. నేటి రాజకీయాలకు అనుగుణంగా మలచుకుంటున్నారు. అందులో ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది. బహుశా అది 2019 కాలం అనుకుంటా.. తెలంగాణలో కెసిఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఏపీలో ఎన్నికలు జరగాల్సి ఉన్న సందర్భం. ఆ సమయంలో టీవీ9 లో రజినీకాంత్ ప్రైమ్ టైం డిబేట్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం, ప్రజలకు చేసిన సేవ అనే ప్రశ్నను రజనీకాంత్ సంధించారు. దానికి జీవన్ రెడ్డి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.. పవన్ కళ్యాణ్ కు ప్రజా సేవ చేసిన అనుభవం లేదని.. ఆయన గొప్ప నటుడు అయితే కావచ్చు గాని.. ఆయనకు పూర్వ అనుభవం లేనందువల్ల గొప్ప నాయకుడు కాడని జీవన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. దానికి బండ్ల గణేష్ మధ్యలో కల్పించుకున్నారు. పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి అని.. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నారని.. కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కేవలం పవన్ కళ్యాణ్ ప్రజాసేవ గురించి మాత్రమే ఈ డిబేట్ నడిచినట్టు కనిపిస్తోంది.. రజనీకాంత్ సంధించిన ఆ ప్రశ్న కు సమాధానం చెప్పడానికి బండ్ల గణేష్.. ఆయనను నిలువరించడానికి జీవన్ రెడ్డి.. ఇలా సాగిపోయింది ఆ డిబేట్ మొత్తం.

నవ్వులు పూయించారు

పవన్ కళ్యాణ్ ను విపరీతంగా పొగుడుతూ బండ్ల గణేష్ వ్యాఖ్యలు చేయగా.. బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించిన మాటలు.. ప్రైమ్ టైం డిబేట్ లో నవ్వులు పూయించాయి. ఎంతో విశ్లేషణాత్మకంగా.. ఎంతో హుందాగా సాగాల్సిన ప్రైమ్ టైం డిబేట్ కాస్త జబర్దస్త్ కామెడీ షో ను తలపించింది. జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే బండ్ల గణేష్ అడ్డు తగలడం.. బండ్ల గణేష్ మాట్లాడుతుంటే జీవన్ రెడ్డి మధ్యలో రావడం ఇలా సాగిపోయింది వ్యవహారం. మొత్తానికి ఆ షో లో మరొక విశ్లేషకుడు ప్రేక్షక పాత్రకు పరిమితం కావలసి వచ్చింది. జీవన్ రెడ్డి – బండ్ల గణేష్ మాట్లాడుతుంటే.. రజనీకాంత్ నవ్వుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఎలా ఉన్నప్పటికీ ఒక చిన్న టాపిక్ మీద అంత సేపు ప్రైమ్ టైం షో నడిపించడం రజనీకాంత్ కు మాత్రమే చెల్లింది. ఆమధ్య వైసీపీ నేతలతో అంటకాగాడని.. భారీగానే వెనుకేసుకున్నాడని.. ఏవేవో ప్రచారాలు జరిగాయి. దానిని రజనీకాంత్ ఖండించాడు. అలాంటి ప్రచారాలు చేస్తే కోర్టుకు లాగుతానని బెదిరించాడు. కాని చివరికి తాను ఎంతగానో ఇష్టపడే ప్రైమ్ టైం షో కు దూరమయ్యాడు. తెర వెనుక కారణాలు ఎలా ఉన్నప్పటికీ.. రజనీకాంత్ లేకుండా ఆ ప్రైమ్ టైం షో సరిగా నడవడం లేదు. దేవి, దీప్తి ఉన్నప్పటికీ రంజు గా సాగడం లేదు. అందులో ఓ యాంకర్ ఎక్కడ “గెటవుట్ ఫ్రం మై స్టూడియో” అంటుందోనని చాలామంది విశ్లేషకులు ప్రైమ్ టైం షో కు రావడమే మానేశారని ఇంటర్నల్ గా టాక్ నడుస్తోంది.