https://oktelugu.com/

Group 1 Notification: కొత్త నోటిఫికేషన్ లో పాత వారి పరిస్థితి ఏంటి?

భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆధ్వర్యంలో గత ఏడాది ఏప్రిల్ నెలలో 503 పోస్టులు భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేసింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 20, 2024 8:08 am
    Group 1 Notification
    Follow us on

    Group 1 Notification: ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే కాస్త అటు ఇటు తేదీలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. కొన్ని పోస్టులు పెంచి మొత్తం 563 పోస్టులతో టీఎస్ పీఎస్ సీ(TSPSC) నూతన ప్రకటన జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. మార్చి 14న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది.. ఈ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలోనే టీఎస్ పీఎస్ సీ(TSPSC) స్వీకరిస్తుంది. నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న వేళ టీఎస్ పీఎస్ సీ(TSPSC) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో వారిలో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

    గతంలో ఇదీ జరిగింది

    భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆధ్వర్యంలో గత ఏడాది ఏప్రిల్ నెలలో 503 పోస్టులు భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేసింది. ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మూడు లక్షల 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది అక్టోబర్ నెలలో టీఎస్ పీఎస్ సీ(TSPSC) గ్రూప్ -1 కు ప్రాథమిక పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు రెండు లక్షల 80 వేల మంది హాజరయ్యారు. ప్రాథమిక పరీక్షకు సంబంధించి ఫలితాలు విడుదలైనప్పటికీ.. ప్రశ్న పత్రం లీక్ కారణంగా గ్రూప్ – 1 ప్రాథమిక పరీక్ష రద్దు చేస్తున్నట్టు బోర్డు ప్రకటించింది. దీంతో మళ్లీ అదే ఏడాది జూన్ నెలలో గ్రూప్ – 1 ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. అప్పట్లో పలువురు అభ్యర్థులు హై కోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు పరీక్ష నిర్వహణలో నిబంధనలు పాటించలేదని, లోపాలు దారుణంగా ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేసింది.. పరీక్ష రద్దు చేయాలని బోర్డును ఆదేశించింది.. అప్పుడు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉండటంతో టీఎస్ పీఎస్ సీ(TSPSC) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈలోపు ఎన్నికలు జరగడం, ప్రభుత్వం మారడంతో.. గతంలో టీఎస్ పీఎస్ సీ(TSPSC) సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఎన్నికలకు ముందు చెప్పినట్టుగానే పాత నోటిఫికేషన్ రద్దు చేసి.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.

    దరఖాస్తు చేసుకోవాలా

    గత ప్రకటనలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా.. ప్రస్తుత నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ పీఎస్ సీ(TSPSC) ప్రకటించింది. గతంలో ఫీజు చెల్లించిన వారు.. ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదని.. నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు మాత్రమే ఫీజు చెల్లించాలని సూచించింది.

    ఇక తాజా ప్రకటనలో ప్రభుత్వం 563 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు టీఎస్ పీఎస్ సీ(TSPSC) అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 23 నుంచి 27 వరకు దరఖాస్తు ఎడిట్ చేసుకునే సౌలభ్యం ఉంది. మే లేదా జూన్ నెలలో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాల వెల్లడి అనంతరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో తుది పరీక్ష నిర్వహిస్తారు. ప్రాథమిక పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతారు.

    గ్రూప్ – 1 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది. వయోపరిమితిని 44 నుంచి 46 సంవత్సరాలకు పెంచింది. ఇక సామాజిక వర్గాల ప్రకారం కూడా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎన్నికలకు ముందు వయోపరిమితి సడలింపు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో టీఎస్ పీఎస్ సీ(TSPSC) అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఇటీవల బడ్జెట్ లో కూడా టీఎస్ పీఎస్ సీ(TSPSC) కి ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయించింది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను పునరావృతం చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుదిట్టంగా ఉద్యోగాల భర్తీలో అడుగులు వేస్తోంది.