Powerful Passports 2024: భారత్ ర్యాంక్ ఎంతంటే?

ప్రస్తుతం భారతీయ పౌరులకు 60 దేశాలు వీసా లేకుండానే తమ దేశాల్లో పర్యటించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇటీవల ఇరాన్, మలేషియా, థాయ్ లాండ్ దేశాలు భారత్ కు వీసా రహిత సందర్శన సౌలభ్యాన్ని కల్పించాయి.

Written By: Suresh, Updated On : February 20, 2024 8:12 am
Follow us on

Powerful Passports 2024: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం ఏదంటే.. రెండవ మాటకు తావు లేకుండా “అమెరికా” అని చెబుతాం.. అత్యధిక విలువైన కరెన్సీ ఏదంటే.. “కువైట్ దినార్” అని బదులిస్తాం. ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన నగరం ఏదంటే.. “లాస్ వేగాస్ ” అని తడుముకోకుండా చెబుతాం. మరి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ ఏదంటే.. కొంచెం ఆలోచిస్తాం.. అలా మనం ఆలోచించే పని చేయకుండా Henley passport index అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ ల జాబితా – 2024 ను విడుదల చేసింది.. అయితే ఈ జాబితాలో గత ఏడాదితో పోలిస్తే భారత దేశ పాస్ పోర్ట్ విలువ ఒక స్థానం దిగజారి 85వ ర్యాంక్ కు పరిమితం అయిపోయింది. నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వీసా రహిత పర్యటనలకు భారతీయ పాస్ పోర్ట్ దారులను అనుమతించే దేశాల్లో మరో రెండు కొత్తగా వచ్చి చేరినప్పటికీ.. భారత్ ర్యాంక్ తగ్గడం విశేషం.

ప్రస్తుతం భారతీయ పౌరులకు 60 దేశాలు వీసా లేకుండానే తమ దేశాల్లో పర్యటించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇటీవల ఇరాన్, మలేషియా, థాయ్ లాండ్ దేశాలు భారత్ కు వీసా రహిత సందర్శన సౌలభ్యాన్ని కల్పించాయి. వీసా లేకుండా ఎన్ని దేశాలకు ప్రయాణించొచ్చు అనే విషయంపై Henley passport index ప్రతీ ఏడాది నివేదిక విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించింది. ఈ నివేదికకు సంబంధించి ఆ సంస్థ పలు అంశాల్లో కీలకంగా సర్వే జరుపుతుంది. దేశ ఆర్థిక స్థితులు, లభిస్తున్న ఉపాధి అవకాశాలు, కరెన్సీ విలువ, రాజకీయాలు, ప్రజల వ్యవహార శైలి, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, భౌగోళికంగా ఉండే వాతావరణ పరిస్థితులన్నింటినీ లెక్కలోకి తీసుకుంటుంది. కొన్ని సంవత్సరాల డాటాను కూడా పరిశీలిస్తుంది.

ఈ జాబితాలో ఫ్రాన్స్(France) తొలి స్థానంలో ఉంది.. ఫ్రాన్స్ పాస్ పోర్ట్ ఉన్న వారు వీసా లేకుండా ఏకంగా 192 దేశాలను చుట్టి రావచ్చు. ఫ్రాన్స్ మాత్రమే కాదు జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ వంటి దేశాలు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. ఈ దేశాలు గత ఏడాది కూడా కాస్తా అటూ ఇటూగా ఇదే ర్యాంకులు కలిగి ఉన్నాయి. మరో వైపు మన పొరుగున ఉన్న పాక్ 106 వ స్థానానికి పరిమితం అయింది.

ఇటీవల మన దేశంతో దౌత్య వివాదానికి దిగిన మాల్దీవులు మాత్రం ఏకంగా 58 వ స్థానానికి చేరుకుంది. ఈ దేశం పాస్ పోర్ట్ ఉన్నవారు ఎటువంటి వీసా లేకుండా 96 దేశాలకు వెళ్లి రావచ్చు. Henley passport index రూపొందించడానికి తీవ్ర కసరత్తు చేస్తుంది. 19 సంవత్సరాల డాటా మొత్తాన్ని పరిశీలించి నివేదిక తయారు చేస్తుంది. వాయు రవాణా సమాఖ్య(Air transport association) ఎప్పటికప్పుడు అందించే సమాచారం కూడా ఈ నివేదికకు కీలకం. ప్రతి నెలలో ఈ డాటా లో కొత్త సమాచారం జతపరుస్తూ ఉంటారు. 199 దేశాల్లోని 227 ప్రయాణ గమ్యస్థానాల సమాచారం మొత్తం ఈ డాటా లో ఉంటుంది. ఈ డాటాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.