https://oktelugu.com/

ACB: పిల్లల పాలను అమ్మేసుకుంది.. అధికారం అడ్డుపెట్టుకుని రూ.65 లక్షలు మింగేసింది!

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని జైనూర్‌ మండలంలో 2015–16లో ఐసీడీఎస్‌ సీడీపీవోగా శ్రీదేవి పనిచేసింది. పిల్లల కోసం కేటాయించిన పాలు, పాలప్యాకెట్లను దారి మళ్లించినట్లు అప్పట్లోనే అధికారులు గుర్తించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 1, 2024 / 11:45 AM IST
    Follow us on

    ACB: ఇందు కలదు.. అందు లేదు అన్నట్లు తయారైంది అవినీతి. ప్రభుత్వం వేతనాలు ఇస్తున్నా.. కొంతమంది సైడ్‌ ఇన్‌కమ్‌పైనే ఆధారపడుతున్నారు. ఇటీవలే గిరిజన ఆశ్రమ పాఠశాల అధికారిని లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డారు. తాజాగా మరో మహిళా అధికారిని కూడా అక్రమాల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. చిన్న పిల్లలకు సరఫరా చేయాల్సిన పాలు, పాల ప్యాకెట్లను దారి మళ్లించినందుకు 8 ఏళ్ల తర్వాత అరెస్ట్‌ చేశారు.

    ఏం జరిగిందంటే..
    ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని జైనూర్‌ మండలంలో 2015–16లో ఐసీడీఎస్‌ సీడీపీవోగా శ్రీదేవి పనిచేసింది. పిల్లల కోసం కేటాయించిన పాలు, పాలప్యాకెట్లను దారి మళ్లించినట్లు అప్పట్లోనే అధికారులు గుర్తించారు. శాఖాపరమైన విచారణ చేపట్టారు. 322 అంగన్‌వాడీ కేంద్రాల్లో గిరిజన పిల్లలకు సరఫరా చేయాల్సిన పాలు, పాల ప్యాకెట్లను ఆమె మంచిర్యాలలోని చాక్లెట్, ఐస్‌క్రీమ్‌ ఫ్యాక్టరీలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు.

    ఏసీబీకి అప్పగింత..
    దీంతో ఈ కుంభకోణం వెలికితీసే బాధ్యతను అధికారులు ఏసీబీకి అప్పటించారు. విచారణ జరిపిన ఏసీబీ అధికారులు అవకతవకలు నిజమే అని నిర్ధారించారు. పాలు, పాలప్యాకెట్లు దారి మళ్లించడం ద్వారా రూ.65.78 లక్షల అవినీతికి పాల్పడినట్లు ధ్రువీకరించారు. 2022లోనే విచారణ పూర్తి చేసిన ఏసీబీ శ్రీదేవి అరెస్ట్‌కు అనుమతి ఇవ్వాలని అప్పటి బీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని కోరారు.

    అనుమతి ఇవ్వక..
    అయితే సదరు అవినీతి అధికారికి నాటి బీఆర్ఎస్‌ పాలకులు బాసటగా నిలిచారు. అరెస్టుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో కేసులో పురోగతి ఆగిపోయింది. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అవినీతి అధికారులపై కొరడా ఝళిపిస్తోంది. ఈ క్రమంలో శ్రీదేవి అరెస్టుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆమెపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఈ కుంభకోణంలో అప్పటి జిల్లా మంత్రి జోగు రామన్న ముఖ్య అనుచరుడి హస్తం ఉండడంతోనే నాడు బీఆర్ఎస్‌ ప్రభుత్వం అరెస్టుకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.