Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కల నెరవేర్చాలని ఇందిరమ్మ ఇంటి పథకం ప్రారంభించారు. ఈమేరకు ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Written By: Raj Shekar, Updated On : July 2, 2024 12:37 pm

Indiramma Houses

Follow us on

Indiramma Houses: పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్లను కూడా చేర్చింది. ఈమేరకు లోక్‌సభ ఎన్నికలకు ముందే ఇందిరమ్మ ఇంటి పథకానికి రేవంత్‌ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు.

ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ..
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కల నెరవేర్చాలని ఇందిరమ్మ ఇంటి పథకం ప్రారంభించారు. ఈమేరకు ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ముందుగా గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని తెలిపారు. 2024–25 బడ్జెట్‌లో ఇందుకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు.

ఐదేళ్లలో 22.50 లక్షల ఇళ్లు..
రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో పేదల కోసం 22.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఇళ్ల పంపిణీ జరుగుతుందని చెప్పారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇల్ల చొప్పున మొదటి విడతలో పంపిణీ చేస్తామని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

బడ్జెట్‌ సమావేశాల తర్వాత..
అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రేవంత్‌ సర్కార్‌.. జూలైలో పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ బడ్జెట్‌ తర్వాతనే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. పథకం ప్రారంభం రోజే ఇంటి నమూనాను చూపించారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హత, ఎవరికి మంజూరు చేస్తారనే గైడ్‌లైన్స్‌ కూడా రిలీజ్‌ చేశారు.

తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికే..
ఇందిరమ్మ ఇళ్లలను మహిళల పేరిట మంజూరు చేయాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించింది. తెల్ల రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. తొలి దశలో భాగంగా సొంత జాగా ఉండి అందులో ఇల్లు లేనివారికి ఆర్థికసాయం అందనుంది. లబ్ధిదారులు స్థానికులై ఉండాలి. అద్దెకు ఉండేవారు కూడా అర్హులే.