Avocado Cultivation In Telangana: ఒకప్పుడు మన దగ్గర పండే పండ్లనే తినేవాళ్లం. కానీ.. ఇప్పుడు విదేశాల్లో పండే పండ్లను కూడా మన దేశానికి దిగుమతి చేసుకుని మరీ తింటున్నాం. కానీ ఈ రైతు కాస్త అడ్వాన్స్‌డ్‌గా ఆలోచించాడు. విదేశీ పండ్లు దిగుమతి చేసుకోవడం కంటే.. మనమే పండించుకోవచ్చు కదా అనుకున్నాడు. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాడు. మెక్సికోలో ఎక్కువగా పండే అవకాడో పండ్లను తెలంగాణలో పండిస్తున్నాడు.
రంగారెడ్డి జిల్లా గిరిజన రైతు ప్రయోగం..
పండ్ల మార్కెట్లో ఎక్కువగా అరటి, జామ, నారింజ, దానిమ్మ, యాపిల్స్ వంటివే కనిపించేవి. ఇప్పుడు వాటితోపాటు డ్రాగన్ ఫ్రూట్, అవకాడో లాంటి విదేశీ పండ్లు కూడా కనిపిస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ మన దగ్గర ఎప్పటినుంచో పండిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కుందూరు మండలం దెబ్బగూడ తండాకు చెందిన గిరిజన రైతు రమావత్ జైపాల్ నాయక్ మాత్రం కొత్తగా ఉంటుందని అవకాడో సాగు చేస్తున్నాడు.
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి..
బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన జైపాల్ నాయక్ పై చదువుల కోసం యునైటెడ్ స్టేట్స్ వెళ్లాడు. అక్కడ మాస్టర్స్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చాడు. ఇక్కడికొచ్చాక ఉద్యోగం చేయడం ఇష్టంలేక సొంతంగా ఏదైనా చేయాలి అనుకున్నాడు. ఆ ఆలోచన నుంచి వచ్చిందే అవకాడో సాగు. మూడేళ్ల క్రితం 220 అవకాడో మొక్కలను రెండెకరాల్లో నాటాడు. ఎలాంటి ఎరువులు వేయకుండానే మొక్కలు ఏపుగా పెరిగి ప్రస్తుతం కాతకు వచ్చాయి.
మామిడికాయలా…
ఈ చెట్టు సుమారు 20 మీటర్ల (66 అడుగులు) వరకు పెరుగుతుంది. ప్రపంచంలోని అన్ని శీతోష్ణ, సమశీతోష్ణ మండలాల్లో ఈ చెట్లను పెంచొచ్చు. పండు కోతకు వచ్చినప్పుడు బాగా కండ పట్టి ఆకుపచ్చ రంగు తోలుతో చూడటానికి మామిడికాయలా ఉంటుంది.
వెన్నలాంటి రుచితో..
అవకాడోను బటర్ ఫ్రూట్(వెన్న పండు) అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం ‘పెర్సీ అమెరికాన’. అల్లెగటర్ పియర్ అని కూడా పిలుస్తారు. ఈ కాయలు ఆకుపచ్చగా లేదా నల్లగా ఉంటాయి. లోపల మెత్తగా ఉంటుంది. తింటే ఆవు వెన్నలా రుచి ఉంటుంది. కాస్త చేదుగా కూడా ఉంటుంది. అవకాడో మధ్యలో ఉండే గింజను మెడిసిన్ తయారీలో వాడతారు.
ఆరోగ్యానికి మేలు
అవకాడో పండు గుజ్జు అనవసరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అవసరమైన కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్లను అవకాడో అదుపు చేస్తుందట. అవకాడోలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. గర్భవతులు అవకాడో తింటే పిల్లలకు పుట్టుకతో వచ్చే కొన్ని అరుదైన వ్యాధులను నిరోధించవచ్చని కాలిఫోర్నియా అవకాడో కమిషన్ చెప్పింది. మోనో అన్ శాచ్యురేటెడ్ కొవ్వుల శాతం, విటమిన్–సి ఎక్కువ. శక్తివంతమైన యాంటీ–ఆక్సిడెంట్లు, విటమిన్– బి6 పుష్కలంగా ఉంటాయి.
అరుదైన పంట గురించి తెలుసుకునేందు క్యూ..
ప్రపంచంలో అవకాడో ఉత్పత్తిలో మెక్సికోది మొదటి స్థానం. ఆ దేశ వాతావరణం అవకాడో పంటకు అనుకూలంగా ఉంటుంది. అక్కడ ఈ పంట బాగా పండుతుంది. అదే పంట ఇక్కడ కూడా పండటంతో ఎంతోమంది రైతులు ఈ పంట గురించి తెలుసుకునేందుకు జైపాల్ దగ్గరకు ‘క్యూ’ కడుతున్నారు. సాగు వివరాలు తెలుసుకుంటున్నారు. పండ్ల కోసం ఫోన్లు చేస్తున్నారు.