MLA Lasya Nanditha: లాస్య నందిత.. సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన ఈ యువ ఎమ్మెల్యే శుక్రవారం తెల్లవారుజామున పటాన్చెరువు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురుగా అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈమె.. 2023 ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 17వేల ఓట్ల తేడాతో తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పై విజయం సాధించారు. అంతకుముందే కంటోన్మెంట్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. కవాడిగూడ కార్పొరేటర్ గా విజయం సాధించారు. 2021 లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.

అయితే అప్పటికి సాయన్న అనారోగ్యానికి గురి కావడం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయడంతో అనూహ్యంగా సాయన్న రాజకీయ వారసురాలిగా లాస్య నందిత తెరపైకి వచ్చారు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ కూడా ఆమెకు కంటోన్మెంట్ టికెట్ ఇచ్చారు. దీంతో ఆ ఎన్నికల్లో ఆమె 17వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే పటాన్ చెరువు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి కంటే ముందు లాస్య నందిత 13 రోజుల వ్యవధిలో మూడు ప్రమాదాలు ఎదుర్కొన్నారు. వాటిలో రెండింటి నుంచి తప్పించుకున్నప్పటికీ.. మూడో ప్రమాదంలో ఆమె కన్నుమూశారు.
ఇటీవల భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించొద్దని కోరుతూ కెసిఆర్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లాస్య నందిత హాజరయ్యారు. అయితే ఆమె కారు ఒక హోంగార్డును గుద్దడంతో అతడు మృతి చెందాడు. ఆ ప్రమాదంలో లాస్యకు గాయాలయ్యాయి. ఆ గాయాల నుంచి ఆమె ఇటీవలే కోలుకుంది. మరోవైపు ఇటీవల ఆమె లిఫ్టులో ఇరుక్కుంది. చాలాసేపు ఆమె అందులో ఉండిపోయింది. సమయానికి దానికి మరమ్మతులు చేయించడంతో బతికి బట్ట కట్టగలిగింది. ఈ రెండు ప్రమాదాల నుంచి బయటపడిన ఆమె పటాన్ చెరువు సమీపంలో జరిగిన ప్రమాదం నుంచి బయటపడలేక పోయింది..
అంతకుముందు రాత్రి ఓ వేడుకలో పాల్గొనడం.. నిద్రలేమి, అధిక వేగం వల్ల వాహనం అదుపుతప్పింది. రేయిలింగ్ ను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అయితే ఈ అప శృతికి కొత్త కారే కారణమని తెలుస్తోంది. ఆమె ఈ వాహనాన్ని ఇటీవల కొనుగోలు చేశారు. వాహనంలో కూర్చున్న సమయంలో ఆమె సీట్ బెల్ట్ ధరించలేదని తెలుస్తోంది. సీట్ బెల్ట్ ధరించి ఉంటే లాస్య బతికేదని ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు అంటున్నారు. లాస్య మృతదేహాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, పలువురు భారత రాష్ట్ర సమితి నాయకులు సందర్శించి నివాళులర్పించారు. ఏడాది క్రితం సాయన్న మృతి చెందడం.. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో కూతురు దుర్మరణం చెందడంతో లాస్య నందిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.