Kalvakunta Kavitha : పార్లమెంటు ఎన్నికలకు ముందు కేసీఆర్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత పేరును నిందితురాలిగా చేర్చింది. ఈ నేపథ్యంలో త్వరలో ఆమె అరెస్టు ఖాయమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటివరకు కొంతమందిని మాత్రమే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ అనంతరం సిబిఐ ద్వారా అరెస్ట్ చేయించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించి వదిలివేసింది. తనను ప్రశ్నించడం పట్ల ఆ మధ్య సుప్రీంకోర్టుకు వెళ్ళిన కవిత కొంత మినహాయింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ కేసులో ఎటువంటి కదలికాలేదు. కానీ అనూహ్యంగా శుక్రవారం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను నిందితురాలిగా పరిగణిస్తూ సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు పలువురు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లు, దర్యాప్తు పూర్తయిన తర్వాతనే కవితకు నోటీసులు ఇచ్చామని సిబిఐ అధికారులు చెబుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటివరకు కేవలం సమాచారం కోసం మాత్రమే కవిత ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు.. ఈ కేసులో నిందితురాలిగా పరిగణిస్తూ సీబీఐ అధికారులు ఆమె పేరును చేర్చారు. ఈ మేరకు కవితకు సీబీఐ 41(ఏ) కింద నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 26న ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు రావాలని సిబిఐ అధికారులు తాము అందజేసిన నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
లిక్కర్ స్కామ్ కు సంబంధించి గత ఏడాదిన్నరగా విచారణ కొనసాగుతోంది. ఈ కుంభకోణంలో పలువురు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కవితకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, కవిత పీఏ అశోక్ కౌశిక్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కవిత అరెస్టుకు సిబిఐ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. విచారణకు హాజరైన అనంతరం కవితను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ అధికారులు ఇప్పటివరకు పలువురు నిందితుల విషయంలో ఇదేవిధంగా వ్యవహరించారు. కవిత విషయంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే కవితను అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. ఆమెను దాదాపు ఆరు నుంచి 8 గంటల వరకు విచారించారు. ఆమె తన వద్ద ఉన్న ఫోన్లను అప్పట్లో ఆమె ఈ డి అధికారులకు అందజేశారు.. ఈడి అధికారులు తనను రాత్రి సమయంలో విచారించడం పట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉంది. కేసు విచారణ పూర్తయ్యేంతవరకు కవిత పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడిని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు ఇటీవల ఈడి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కు సంబంధించి తుది తీర్పు వచ్చేవరకు విచారణకు హాజరుకాని కవిత చెప్పారు. ఇప్పుడు అనూహ్యంగా సిబిఐ నోటీసులు పంపించడం ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ ఎన్నికలవేళ కవితకు నోటీసులు జారీ చేయడం.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా చేర్చడం.. ఈ పరిణామాలు అటు కెసిఆర్ కు, ఇటు భారత రాష్ట్ర సమితికి ప్రతి బంధకాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నోటీసులపై కవిత ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.