Kaleshwaram Project: “నా మెదడును రంగరించిన.. రక్తపు బొట్టు ఖర్చుపెట్టిన. కాళేశ్వరం కట్టిన. అసలు నీకు ఆ ప్రాజెక్టు గురించి ఎరుకన. ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్లు వస్తున్నాయో ప్రతిపక్షాలకు ఏరికేనా.. అసలు వీళ్లకు సోయి ఉన్నదా.. తెలంగాణ మీద ఇవాల్టికి మాకు రైట్ ఉన్నది. ఏం చేయాలన్న మేమే చేయాలే” అప్పట్లో కెసిఆర్ అన్న మాటలివి. కానీ ఇదే కేసీఆర్ కాలేశ్వరం కమిషన్ విచారణకు హాజరైనప్పుడు.. తనకు ఏమీ తెలియదని.. మొత్తమంతా అధికారులు చేశారని చెప్పాడు కదా.. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.. కాలేశ్వరంలో అనేక డొల్లలు.. అనేకానేక అవకతవకలు.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మీద రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘోష్ కమిషన్ అనేక బ్లాస్టింగ్ విషయాలను తన నివేదికలో పేర్కొందట. దీని ఆధారంగా రేవంత్ ఎటువంటి చర్యలు తీసుకుంటాడు.. ఏ విధమైన అడుగులు వేస్తాడనేది తర్వాత అధ్యాయం.
జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని..
ఇప్పటికే ఈ అంశాలను జనంలోకి బలంగా తీసుకుపోవాలని కాంగ్రెస్ డిసైడ్ అయిందట. కాళేశ్వరం ద్వారా తెలంగాణ సంపదను కేసీఆర్ ఎలా దోచుకున్నది.. ఈ తెల్ల ఏనుగు స్కీం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎలా నాశనం అయింది .. వివరించేందుకు రెడీ అయ్యారట కాంగ్రెస్ నాయకులు.. వాస్తవానికి ఘోష్ కమిషన్ నివేదికలో మీడియాకు సంక్షిప్త సమాచారం మాత్రమే లీక్ అయిందట. ఇంకా అనేక అంశాలు ఇందులో ఉన్నాయట. అందువల్లే కెసిఆర్ క్యాంపు ఆ విషయాలను బయటకు రాకుండా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుందట. వాస్తవానికి కమిషన్ ఏర్పాటును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకించింది. తర్వాత ఆ నివేదికను శాసనసభలో పెట్టకూడదని డిమాండ్ చేసింది. ఒకవేళ పెట్టినా కూడా మీద చర్యలు తీసుకోవద్దని స్ఫష్టం చేసింది. అక్కడితోనే ఆగలేదు.. కోర్టుల దాకా వెళ్ళింది.. రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది.. దీన్నిబట్టి అసలు ఆ కమిషన్ రిపోర్ట్ లో బ్రహ్మాండం బద్దలై పోయే విషయాలన్నీ ఉన్నాయని అర్థమవుతుంది కదా.. అందువల్లే దీనిని పక్కదారి పట్టించడానికి హరీష్ రావు ఇప్పటికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అవకాశం ఇస్తే శాసనసభలో పీపీటీ ప్రదర్శన ఇస్తారని కోరుతున్నాడు. ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు రిపోర్ట్ అంశాలను వివరించారట. శాసనసభలో భారత రాష్ట్ర సమితిని ఎలా నిలువరించాలి.. ఎలా కౌంటర్లు ఇవ్వాలి.. అనే విషయాలపై కీలకమైన సూచనలు కూడా చేశారట. మొత్తంగా చూస్తే దీనిపై తీవ్రాతీతీవ్రమైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మేడిగడ్డకు ఏర్పడిన పగుళ్లు కాస్త రిపేర్ చేస్తే చాలు.. నీళ్లు మొత్తం ఎత్తిపోవచ్చు అని గులాబీ పార్టీ.. దానికి బాకా ఊదే సోషల్ మీడియా ఎర్నలిస్టులు అంటున్నారు. వాస్తవానికి కుంగిపోయిన ఆ పిల్లర్లు మాత్రమే కాదు.. అసలు మేడిగడ్డ బారాజ్ మొత్తం మళ్లీ కట్టాల్సిందేనట.
అన్నారం, సుందిళ్ల కూడా..
ఇది మాత్రమే కాదు అన్నారం, సుందిళ్ల కూడా సురక్షితం కావట. పిల్లర్ల కిందికి మట్టి వచ్చి చేరడంతో బరాజ్ ల నాణ్యత మొత్తం నేతి బీర చందం అయిపోయిందట. శాటిలైట్ ఇమేజెస్ కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయట.. బుంగలు బయటపడకుండా మట్టితో నింపడం.. సామర్థ్యానికి మించి నీళ్లను నిల్వ చేయడం వల్ల.. అనేక పరిణామాలు ఎదురవుతాయని.. ఈ భారాన్ని మొత్తం తెలంగాణ సమాజం భరించాల్సి ఉంటుందని ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొందట. ఇప్పటివరకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెచ్చిన అప్పులకు 16 వేల కోట్ల వరకు మిత్తులు కట్టారట. కొన్నిచోట్ల పనులు పూర్తిగా కాకుండానే నగదు చెల్లింపులు జరిపారట.
రేవంత్ ఎందుకు ఊరుకుంటాడు
ఎన్నికలకు ముందు ప్రతిపక్షాన్ని తొక్కేయాలని.. గెలుపును సొంతం చేసుకోవాలని.. ఈ ప్రపంచ వింతను ప్రదర్శించాలని నింబంధనలు మొత్తం తుంగలో తొక్కేశారట. ఈ స్కీమ్ లో 30 వేల కోట్ల తోనే గ్రావిటీ, కొంతమేర లిఫ్టు ఉంటే సరిపోయేదట. కానీ ఏకంగా లక్ష కోట్లకు స్కీం ను పెంచేసి.. పూర్తిగా నిరర్థకంగా మార్చేశారట. దీనికి ఎవరి బాధ్యులు.. ఒకవేళ ఆ బరాజ్ లను మళ్లీ కడితే.. జరిగే ప్రయోజనం ఏమిటి.. అనే విషయాల్లోకి తెలంగాణ ప్రభుత్వం గనుక వెళితే.. రాజకీయ నిర్ణయాలను అత్యంత కీలకంగా గనుక తీసుకుంటే.. గులాబీ క్యాంప్ గొప్పగా ప్రచారం చేసిన తెలంగాణ త్రీ గోర్జెస్ పరిస్థితి మేడిపండు చందం గానే మిగిలిపోతుంది. అంతే కాదు ఏడో ప్యాకేజీ అంచనాలను ఏకంగా ఆరు నెలల సమయంలోనే రెండింతలు పెంచారని తెలుస్తోంది. కొన్నిచోట్ల భూమి నాణ్యతను కూడా పరిశీలించకుండా నిర్మాణాలు చేపట్టారట. అన్నట్టు గులాబీ అధినేత గొప్పగా చెప్పుకున్న తన మానస పుత్రిక కథ ఏమిటో తేల్చాలనే పట్టుదల తో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి.. ఏకంగా కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ కీలకమైన విషయాలను వెల్లడించింది. అలాంటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి నిశ్శబ్దంగా ఎందుకుంటారు.. ఒకవేళ నిశ్శబ్దంగా ఉంటే గులాబీ పార్టీ రెచ్చి పోతుంది కదా.. తెలంగాణ ముఖ్యమంత్రి కి ఆ మాత్రం తెలియదా.. అతను కూడా జైలుకు వెళ్లి వచ్చినవాడే కదా.. ఎలా ఊరుకుంటాడు.. ఎందుకు ఊరుకుంటాడు..