Teenmar Mallanna New Party: ఇప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల మినహా చెప్పుకునే స్థాయిలో ఎలక్షన్స్ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీల ఏర్పాటు అనేది దాదాపు కష్టమనే చెప్పాలి. కానీ తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలకు ముందు ఉన్నట్టుగా వాతావరణం ఉంది. పైగా నాయకులు పోటా పోటీగా రాజకీయ పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకు ఆ పార్టీ విషయంలో క్లారిటీ రాలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తానని కొంతకాలంగా అంటున్నారు. చివరికి ఆ మాట నిలబెట్టుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహార శైలి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కుల గణన విషయంలో అధికార పార్టీని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఓ సామాజిక వర్గాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆయన వ్యవహార శైలి పట్ల ఆగ్రహం గా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్న అనేక రకాలుగా తన రాజకీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. చివరికి రాజకీయ పార్టీని ప్రకటించారు. దానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీగా పేరు పెట్టారు. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా తన పార్టీ ఉంటుందని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. భారీగా వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి తాజ్ బంజారా హోటల్లో తన పార్టీ పేరును ప్రకటించారు తీన్మార్ మల్లన్న.
తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీ పెట్టడం ఆశ్చర్యం కాకపోయినప్పటికీ.. ఆయన ఎంతవరకు ఈ పార్టీని నడపగలుగుతారు.. ఎంతవరకు నిలబడగలుగుతారు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఎందుకంటే తీన్మార్ మల్లన్న రాజకీయ ప్రయాణం స్థిరంగా లేదు. మొదట్లో ఆయన బిజెపిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బయటికి వచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందులో కూడా ఇమడ లేకపోయారు. బిజెపిలో చేరే ముందు ఆయన మీద కేసులు ఉండేవి. బిజెపిలో చేరిన తర్వాత బయటికి రాగలిగారు. అలాగని బిజెపిలో కూడా ఆయన స్థిరంగా ఉండలేకపోయారు. కొంతకాలానికే మళ్లీ కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆయన తన నిరసన స్వరాన్ని వినిపించడం మొదలుపెట్టారు. ఇలా రెండు ప్రధాన పార్టీల నుంచి త్వరగా నే బయటికి వచ్చిన ఆయన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ఒక రకంగా సంచలనమే అయినప్పటికీ.. దానిని ఎంతవరకు నిలుపుకుంటారనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.