Meenakshipuram: అందో చిన్న గ్రామం.. రెండు దశాబ్దాల క్రితం వరకు 1,296 మందితో ఊరు కళకళలాడేది. ఉన్న కొది మంది కూడా బంధాలు, అనుబంధాలతో సంతోషంగా జీవించేవారు. పాడి పంటలతో ఊరు పచ్చగా ఉండేది. కానీ, 2001 తర్వాత మారిన వాతావరణ పరిస్థితులు ఆ ఊరిని ఖాళీ అయ్యేలా చేశాయి. ఊరంతా వెళ్లిపోయినా.. ఓ వ్యక్తి మాత్రం ఉన్న ఊరు.. కన్న తల్లితో సమానం అని భావించి.. ఊరిపై మమకారంతో అదే ఊళ్లో ఉండిపోయాడు. ఒంటరిగా ఇంట్లో ఒకపూట ఉండడానికే భయపడతాం. కానీ ఆయన దాదాపు 20 ఏళ్లు అక్కడే ఒంటరిగా ఉండిపోయాడు. ఆయన కూడా మే 30(గురువారం) మరణించాడు. దీంతో ఊరు.. దెయ్యాల గ్రామంగా మారింది.
తమిళనాడులో..
తమిళనాడు రాష్ట్రంలోని మీనాక్షిపురం గ్రామంలో 2001 వరకు సుమారు 1,296 మంది ఉండేవారు. 2001 తర్వాత గ్రామంలో తీవ్ర కరువు అలుముకుంది. వరుసగా ప్రతీ ఏడాది వాతావరణ మార్పులతో సరైన వర్షాలు కురవలేదు. దీంతో గ్రామస్తులకు ఉపాధి కరువైంది. ఇక ఊళ్లో ఉంటే బతకడం కూడా కష్టమే అన్న భావనతో అందరూ ఒక్కక్కరూగా ఊరు వదిలి వెళ్లడం ప్రారంభించారు. ఉపాధి వెతుక్కుంటూ కొందరు వేరే గ్రామాలకు వెళ్లిపోగా, మరి కొందరు పట్టణాలకు వలస వెళ్లారు.
ఒంటరిగా రెండు దశాబ్దాలు..
మీనాక్షిపురం 2001 నుంచి ఖాళీ అయింది. అయినా గ్రామానికి చెందిన కందసామి నాయకర్(73) తన భార్యతో అక్కడే ఉండిపోయాడు. ఊళ్లో ఎవరూ లేకపోయినా.. తను మాత్రం ఊరు వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. గ్రామస్తులు కూడా పలుమార్లు ఊరికి వచ్చి నాయకర్‌ను తమ వెంట రావాలని కోరాడు. కానీ ఆయన చిన్న చితక పనులు చేసుకుంటూ భార్యను పోషించుకుంటూ రెండు దశాబ్దాలు ఉండిపోయాడు. ఈ క్రమంలో అతని భార్య కొన్నేళ్ల క్రితం మరణించింది. దీంతో మళ్లీ కొందరు ఊరు వదలి రావాలని నాయకర్‌ను కోరారు. కానీ, ఆయన ఆసక్తి చూపలేదు. ఒంటరి జీవనం సాగించాడు.
ఆగిన ప్రయాణం..
ఇక నాయకర్ దాదాపు 20 ఏళ్ల ఒంటరి ప్రయాణం.. ఎట్టకేలకు ఆగింది. వృద్ధాప్యం, ఇతర సమస్యలతో గురువారం(మే 30న) మీనాక్షిపురంలోనే మరణించాడు. గ్రామానికి చెందిన వారు నాయకర్‌ను చూసేందుకు రాగా ఆయన మరణించి ఉన్నాడు. దీంతో గ్రామం దెయ్యాల గ్రామంగా మారింది.