https://oktelugu.com/

Telangana Politics : అటు అసెంబ్లీకి.. ఇటు పార్లమెంట్ కు.. దేన్నీ వదలని నేతలు

అయితే ఈ రెండు ఎన్నికల్లో కొంతమంది ప్రజాప్రతినిధులు పోటీ చేశారు. ఇంతకీ వారు ఎందుకు పోటీ చేశారు.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వారి పరిస్థితి ఏమిటి.. ఒకసారి పరిశీలిస్తే..

Written By:
  • NARESH
  • , Updated On : May 16, 2024 / 11:03 AM IST

    Bandi sanjay Etela Dharmapuri

    Follow us on

    Telangana Politics : అధికారమనేది ఒక మత్తు లాంటిది. దానికి అలవాటు పడ్డవారు దూరంగా జరగలేరు. ఏదో ఒక రూపంలో అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.. పైగా మన సమాజం అధికారంలో ఉన్న నాయకులకే విలువ ఇస్తుంది. ఒకవేళ అధికారానికి దూరంగా ఉంటే ఆ నాయకులను సమాజం కూడా దూరం పెడుతుంది. ఇక కార్యకర్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెల్లం ఉన్నప్పుడే ఈగలు వాలినట్టు.. అధికారం ఉన్నప్పుడే కార్యకర్తలు, నాయకులు, ఇతర అధికారులు చుట్టూ ఉంటారు. అదే కోల్పోతే దూరం జరుగుతారు. అధికారం పోతే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో నాయకులు తెలుసు కాబట్టి.. దాన్ని కాపాడుకునేందుకు రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.. అయితే ఈ రెండు ఎన్నికల్లో కొంతమంది ప్రజాప్రతినిధులు పోటీ చేశారు. ఇంతకీ వారు ఎందుకు పోటీ చేశారు.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వారి పరిస్థితి ఏమిటి.. ఒకసారి పరిశీలిస్తే..

    ఈటల రాజేందర్

    భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. హుజురాబాద్ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ తో పాటు మాజీ సీఎం కేసీఆర్ పై గజ్వేల్ స్థానంలో పోటీ చేశారు. అటు గజ్వేల్ తో పాటు ఇటు హుజురాబాద్ లోనూ ఈటల రాజేందర్ ఓడిపోయారు. దీంతో తన రాజకీయ భవితవ్యాన్ని కాపాడుకునేందుకు దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్ధులుగా భారత రాష్ట్ర సమితి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఈ పోటీలో తాను విజయం సాధిస్తానని ఈటల రాజేందర్ ధైర్యంగా ఉన్నారు.

    బండి సంజయ్..

    బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన భారత రాష్ట్ర సమితి అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పై అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఆ తర్వాత ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. ఈసారి కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి మళ్లీ పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచాల రాజేందర్ రావు కూడా పోటీ చేశారు. గత ఎన్నికల్లో ద్విముఖ పోరు ఉంటే.. ఈసారి త్రిముఖ పోరు ఉంది. అయితే ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని బండి సంజయ్ గట్టి నమ్మకంతో ఉన్నారు.

    ధర్మపురి అరవింద్

    నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆ స్థానంలో అరవింద్ ఓడిపోయారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ధర్మపురి అరవింద్ మళ్లీ నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ధర్మపురి అరవింద్ కు ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు . అయితే ఈ ఎన్నికల్లో అటు జీవన్ రెడ్డి, ఇటు అరవింద్ తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    జీవన్ రెడ్డి..

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవన్ రెడ్డి సుదీర్ఘమైన అనుభవం ఉన్న రాజకీయ నేత. జగిత్యాల అసెంబ్లీ స్థానంలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఓడిపోవడంతో .. ఎమ్మెల్సీగా పోటీ చేశారు . ఆ ఎన్నికల్లో జీవన్ రెడ్డి విజయం సాధించారు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి జీవన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన నిజామాబాద్ స్థానం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేశారు. అయితే ఈ స్థానంలో తాను విజయం సాధిస్తానని జీవన్ రెడ్డి చెబుతున్నారు. జీవన్ రెడ్డికి ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఉన్నారు. వీరిద్దరి మధ్య పోటీ హోరాహోరీగా జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

    కొప్పుల ఈశ్వర్

    గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ పని చేశారు . ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.. సింగరేణి ఓట్లు అధికంగా ఉండే పెద్దపల్లి నియోజకవర్గం లో ఈసారి కచ్చితంగా తన గెలుస్తానని ఈశ్వర్ చెబుతున్నారు. మరోవైపు ఈశ్వర్ కు పోటీగా గడ్డం వంశీకృష్ణ ఉన్నారు. వంశీకృష్ణ గడ్డం వివేక్ కుమారుడు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు దివంగత వెంకటస్వామి అలియాస్ కాకా కు మనవడు. అయితే ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని వంశీకృష్ణ చెబుతున్నారు.