https://oktelugu.com/

SRH vs GT : ప్లే ఆఫ్ వెళ్లాలంటే.. సన్ రైజర్స్ గెలవాల్సిందే

ఇక ఇప్పటివరకు హైదరాబాద్, గుజరాత్ నాలుగు సార్లు తలపడగా.. మూడుసార్లు గుజరాత్ విజయం సాధించింది.. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో అదరగొడుతున్న హైదరాబాద్ జట్టు.. గురువారం నాటి మ్యాచ్లో ఏ మేరకు చెలరేగుతుందో చూడాలి.

Written By: , Updated On : May 16, 2024 / 10:45 AM IST
Follow us on

SRH vs GT : ఐపీఎల్ లో మరో ఆసక్తికర మ్యాచ్ కు రంగం సిద్ధమైంది.. ప్లే ఆఫ్ లో స్థానం కోసం జరిగే పోరాటంలో హైదరాబాద్ గుజరాత్ జట్టుతో అమీ తుమీ తేల్చుకోనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ వేదికపై జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ముంబై జట్టుపై భారీ స్కోరు సాధించింది.. ఇటీవల లక్నో జట్టుపై జరిగిన మ్యాచ్లో పది వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ ప్రకారం చూసుకున్నా లక్నో కంటే హైదరాబాద్ మెరుగైన స్థితిలో కనిపిస్తోంది. అయితే సంచలన ఆటలో గుజరాత్ జట్టు ప్రసిద్ధి పొందింది. ఐపీఎల్ ప్రారంభ సీజన్లో కప్ దక్కించుకున్న ఆ జట్టు.. గత ఏడాది రన్నరప్ గా నిలిచింది .

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇప్పటికే ఆ జట్టు ప్లే ఆఫ్ నుంచి బయటికి వెళ్లిపోయింది. హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ వెళ్లాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాలి. పైగా ఇటీవల ఈ రెండు జట్లు తలపడగా.. గుజరాత్ విజయాన్ని అందుకుంది. అప్పటి పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని సన్ రైజర్స్ భావిస్తోంది.

ఉప్పల్ పిచ్ పై హైదరాబాద్ కు తిరుగులేని రికార్డు ఉంది. ముంబై మీద ఏకంగా 277 రన్స్ కొట్టి ఐపిఎల్ లో సరికొత్త చరిత్రను హైదరాబాద్ సృష్టించింది.. ఈ నేపథ్యంలో గురువారం నాటి మ్యాచ్లో కూడా భారీ పరుగులు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్యాటింగ్లో హైదరాబాద్ జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది.. హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, మార్క్రం వంటివారు భీకరమైన ఫామ్ లో ఉన్నారు. అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి తమదైన రోజు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలరు.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇంతటి ఫామ్ లో ఉన్న హైదరాబాద్ జట్టును నిలువరించాలంటే గుజరాత్ జట్టు సమిష్టిగా ఆడాల్సి ఉంటుంది.

ప్రస్తుత ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు 12 మ్యాచులు ఆడగా, ఏడు విజయాలు సొంతం చేసుకుంది.. 14 పాయింట్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం హైదరాబాద్ ప్లే ఆఫ్ వెళ్లాలంటే ఒక పాయింట్ అవసరం. గుజరాత్ జట్టుతో జరిగే మ్యాచ్లో హైదరాబాద్ గెలిస్తే.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే హైదరాబాద్ ప్లే ఆఫ్ వెళ్లిపోతుంది. ఒకవేళ గుజరాత్ జట్టు జరిగే మ్యాచ్లో ఓడిపోతే.. హైదరాబాద్ ప్లే ఆఫ్ వెళ్లేందుకు మరో అవకాశం కూడా ఉంటుంది. కానీ వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచి.. ప్లే ఆఫ్ జాబితాలో రెండవ స్థానంలో నిలవాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది.

ఉప్పల్ మైదానంలో ఇటీవల లక్నో జట్టు విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఒక్క వికెట్ కోల్పోకుండా హైదరాబాద్ చేదించింది. ఆ మ్యాచ్ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో హైదరాబాద్ ఆటగాళ్లు గుజరాత్ జట్టుతో పోరుకు సై అంటున్నారు. ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన గుజరాత్ జట్టు.. విజయంతో లీగ్ దశ నుంచి నిష్క్రమించాలని భావిస్తోంది. ఇక ఇప్పటివరకు హైదరాబాద్, గుజరాత్ నాలుగు సార్లు తలపడగా.. మూడుసార్లు గుజరాత్ విజయం సాధించింది.. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో అదరగొడుతున్న హైదరాబాద్ జట్టు.. గురువారం నాటి మ్యాచ్లో ఏ మేరకు చెలరేగుతుందో చూడాలి.