HomeతెలంగాణRuna Mafi: వారికి రుణమాఫీ లేదు.. స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం..

Runa Mafi: వారికి రుణమాఫీ లేదు.. స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం..

Runa Mafi: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలలో ప్రధానమైనది రైతు రుణమాఫీ. ఆ రుణమాఫీకి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రుణమాఫీ కోసం దాదాపు 31 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇవ్వడంతో రుణమాఫీ పథకానికి సంబంధించి ప్రభుత్వం అర్హులను గుర్తించే పనిలో పడింది. నిధుల లభ్యత లేని కారణంగా.. అర్హులకే రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ వర్తింప చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రుణమాఫీ కోసం అవసరమయ్యే 31 వేల కోట్లకు.. ప్రభుత్వం ఇప్పటికే 10,000 కోట్లను సిద్ధం చేసుకుంది. టీజీ ఐఐసీ భూములను బ్యాంకులకు తనఖా పెట్టి మరో 10 వేల కోట్లను సమీకరించనుంది. రుణాల రూపంలో మరో 10 వేల కోట్లను ఏర్పాటు చేసుకోనుంది. ఒకే దఫాలో రెండు లక్షల పంట రుణాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆగస్టులోగా ఈ రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రుణమాఫీ పథకం ప్రధాన కారణమైంది. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రుణమాఫీ విషయంలో పిల్లి మొగ్గలు వేయడంతో.. అలాంటి పరిస్థితి తలెత్తకూడదని రేవంత్ ప్రభుత్వం కట్టుదిట్టంగా అడుగులు వేస్తోంది. నిధుల లభ్యత లేకపోయినప్పటికీ.. ఉన్న వనరుల ఆధారంగా నిధులను సమీకరించుకుంటున్నది. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తం కాకముందే.. రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అయితే ఈ రైతు రుణాల జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులను మొదట మినహాయించాలి అనుకున్నప్పటికీ.. ఆ తర్వాత ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ప్రజా ప్రతినిధులు మినహా, మిగతా వారందరి రుణాలను మాఫీ చేసేందుకే ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version