Medaram Jatara 2024: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక – సారలమ్మ జాతర మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, బంగారం ఎత్తుకుని బయల్దేరే భక్తులు.. ఇసుకేస్తే రాలనంత జన సందోహం.. ఇదీ మేడారం జాతర జరిగే తీరు. ఈ జాతరలో సమ్మక్క, సారలమ్మకు అత్యంత ప్రియమైన బంగారం(బెల్లం) సమర్పించడం ఆనవాయితీ. కోరిన కోరికలు తీరితే భక్తులు అమ్మవార్లకు ఎత్తు బెల్లం సమర్పిస్తారు. ఇక ఈ జాతరకు తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తారు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. విదేశీయులు కూడా మేడారం వస్తారు.
బెల్లం వ్యాపారం బంగారం..
అమ్మవార్లకు మొక్కులు చెల్లింపుల్లో ప్రధానమైనది బెల్లం. కోరిన కోరికలు తీర్చే తల్లులకు ఎత్తు బంగారం(బెల్లం) సమర్పిస్తామని మొక్కుకుని ఆమేరకు చెల్లించుకుంటారు భక్తులు. సమ్మక్క పున్నం( పౌర్ణమి) నుంచి మొదలు మేడారం జాతర వరకు బెల్లం సమర్పించుకుంటారు. దీంతో మేడారం జాతరలో నెల రోజులుగా బెల్లం వ్యాపారం జోరుగా సాగుతోంది. వరంగల్ ప్రాంతానికి భారీగా బెల్లం దిగుమతి అవుతోంది. పాత బీట్ బజార్ నుంచి మేడారానికి బెల్లం తరలిస్తున్నారు. జనగాం, మహబూబ్‌బాద్, పరకాల, వర్ధన్న పేట, స్టేషన్ ఘనపూర్, గోపాలపల్లి, ములుగు, ఇతర పట్టణాల్లో కూడా బెల్లం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
టన్నుల కొద్దీ విక్రయాలు..
ఇక తెలంగాణ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అంతటా బెల్లం టన్నుల కొద్దీ విక్రయిస్తున్నారు. మామూలు రోజుల్లో సుమారు పది టన్నుల బెల్లం అమ్మకాలు జరిగితే ప్రస్తుతం 40 నుంచి 50 టన్నుల చొప్పున అమ్మకాలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. రోజుకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అమ్ముతున్నట్లు టోకు వ్యాపారులు చెబుతున్నారు. ఇక చిల్లర ధరతో దాదాపుగా రూ.20 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది.
జాతర వస్తే వాళ్లకు పండగే..
ఇక రెండేళ్ల కోసారి జగిరే మేడారం జాతర బెల్లం వ్యాపారులకు పెద్ద పండుగ. ఎందుకంటే.. ఏడాదంతా జరిగే వ్యాపారం కేవలం నెల రోజుల్లోనే జరుగుతుంది. ఈ రోజుల్లో వ్యాపారం మామూలుగా ఉండదు. కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి బెల్లం రేట్‌ను నియంత్రిస్తారు. వాళ్లు చెప్పిన ధరకే అమ్మకాలు సాగిస్తారు. హోల్‌సేల్‌గా బెల్లం ధర కిలో రూ.35 వరకు ఉండగా, దానిని మేడారంలో రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో రూ.40 నుంచి రూ.45 వరకు అమ్ముతున్నారు. ఇలా నెల రోజులుగా బెల్లం అమ్మకాలతో వ్యాపారం బంగారం అవుతోంది.