Hyderabad: హైదరాబాద్ నగరంలో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోంది. సోమవారం రాత్రి మెహదీపట్నం పరిధిలోని ఆసిఫ్ నగర్ లో యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించడం తెలిసిందే. దీంతో మత్తు పదార్థాల ఉపయోగం ఇంకా నగరంలో అదుపులోకి రాలేదని తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో యువకులు మత్తులో పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు ప్రభుత్వం మత్తు పదార్థాల ముప్పు లేకుండా చేయాలని భావిస్తున్నా వాటి వినియోగం మాత్రం ఆగడం లేదు. ఫలితంగా రోజు ఏదో ఒక సందర్భంలో మత్తు పదార్థాల గుట్టు రట్టవుతూనే ఉంది. కానీ ఇంతకీ ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దాని మూలాలు ఏమిటి? అనే దానిపై స్పష్టత రావడం లేదు.

ఈ నేపథ్యంలో గంజాయి సేవించిన యువకులు వీరంగం చేయడంతో పోలీసులు వారించినా వినకపోవడంతో పెద్ద దుమారమే రేగింది. దీనిపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయినా యువకులకు గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? దాని వినియోగంపై నిబంధనలు ఉన్నా ఎవరికి మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో మత్తు పదార్థాల వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో నగరంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతోంది.
గతంలో ఓ పబ్ లో దొరికిన మత్తు పదార్థాల కేసులో పెద్ద వారి హస్తం ఉందని తేలినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచి గంజాయి సరఫరా ఆగడం లేదు. మత్తు పదార్థాల వినియోగం పెరుగుతూనే ఉంది. దీంతోనే నగరవాసులకు సైతం తిప్పలు తప్పడం లేదు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణాకు చెక్ పడటం లేదు. ఎన్ని చర్యలు తీసుకున్నా వాటి రవాణా అంతకంతకూ పెరుగుతోంది. దీనిపై రాజకీయ పక్షాలు సైతం విమర్శలు చేస్తున్నాయి.
ఏకంగా పోలీసు వాహనంపైనే దాడులకు తెగబడటం మామూలు విషయం కాదు. మత్తు పదార్థాల వాడకంతో యువత పెడదారులు తొక్కుతోంది. గతంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని గంజాయికి అలవాటు పడి ఏకంగా ఆ వ్యాపారం చేయడం ఆందోళన కలిగించింది. నగరంలో మత్తు పదార్థాల రవాణా తగ్గడం లేదు. దీంతోనే పోలీసుల తీరుపై కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే గంజాయి రవాణా ఆగడం లేదని తెలుస్తోంది. దానికి అడ్డుకట్ట వేసే సమయం ఎప్పుడొస్తుందనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.