SSC Students: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షలకు ఇంకా రెండు నెలలే సమయం ఉండడంతో అన్ని పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సిలబస్ పూర్తి కావడంతో పూర్తిగా పునఃశ్చరణ, పరీక్షల నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులు కూడా పరీక్షల్లో పాస్ అయ్యేలా సన్నద్ధం చేయిస్తున్నారు. పరీక్షల్లో భయం పోగొడుతున్నారు. ఇందుకోసం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఉదయం 8 గంటలకు పాఠశాలలకు వస్తున్న విద్యార్థులకు సాయంత్రం 6 గంటల వరకు పాఠశాలలోనే ఉంటున్నారు. వారికి మధ్యాహ్న భోజనం మినహా ఎలాంటి స్నాక్స్ ఇవ్వడం లేదు. దీంతో సాయంత్రానికి అలసిపోతున్నారు. ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. చదువుపై సరిగా దృష్టి పెట్టడం లేదు. కొన్ని పాఠశాలల్లో దాతల సాయంతో స్నాక్స్ అందిస్తున్నారు.
అందరికీ స్నాక్స్..
ఈ తరుణంలో ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించాలని నిర్ణయించింది. ఈమేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ.నర్సింహారెడ్డి బుధవారం(జనవరి 29న) ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు దీనిని అమలు చేయనున్నారు. సాయంత్రం నిర్వహించే ప్రత్యేక తరగతుల్లో వీటిని అందిస్తారు. ఇందులో ఉడకబెట్టిన పెసర్లు, బబ్బర్లు, పల్లిపట్టీ, మిల్లెట్ బిస్కెట్, ఉలిల్గడ్డ పకోడి, ఉల్లిగడ్డ శనగలు అందిస్తారు. దీనికోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ మేరకు నిధులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఖాతాల్లో జమన చేయనున్నట్లు ప్రకటించింది. వీటిని మిడ్‌డే మీల్స్ ఏజెన్సీల ద్వారా చేయించాలని ఆదేశించింది.
మార్చి 21 నుంచి పరీక్షలు..
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో జారీ చేయనున్నారు. అధికారిక వెబ్‌జైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్
మార్చి 21 – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 22 – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 24 – ఇంగ్లిష్
మార్చి 26 – మ్యాథ్స్
మార్చి 28 – ఫిజిక్స్
మార్చి 29 – బయాలజీ
ఏప్రిల్ 2 – సోషల్ స్టడీస్
ఏప్రిల్ 3 – పేపర్–1 లాంగ్వేజ్ పరీక్ష (ఒకేషనల్ కోర్సు)
ఏప్రిల్ 4 – పేపర్–2 లాంగ్వేజ్ పరీక్ష (ఒకేషనల్ కోర్సు)