Telangana Congress: ఈ కథనం లోపలికి వెళ్లే ముందు చిన్న విషయం చెప్పుకుందాం.. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ కాంగ్రెస్ తన సీట్లు పెంచుకుంటూ వస్తోంది.. నరేంద్ర మోడీ లాంటి వ్యక్తిని ఢీ కొట్టుకుంటూ పోలింగ్ శాతాన్ని క్రమంగా మెరుగుపరుచుకుంటున్నది. కీలక నేతలు కమలం పార్టీలోకి వెళ్లిపోయినప్పటికీ “ఖామ్” పేరుతో సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నది. చరిత్రలో మొదటిసారి గుజరాత్ ఎన్నికల్లో గాంధీ కుటుంబ సభ్యులు లేకుండా ప్రచారం చేసింది. గెలుస్తుందా? ఓడుతుందా? అనే విషయాన్ని పక్కన పెడితే… ప్రత్యర్థి పార్టీ మింగేయాలని చూస్తున్నా.. అంతకంతకు పోరాట పటిమ చూపిస్తోంది. సరే ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ అధికారం దక్కింది తెలంగాణ రాష్ట్ర సమితికి. రాష్ట్రం ఇచ్చిన సానుభూతిని ఓట్ల రూపంలో మలుచుకోలేని దౌర్భాగ్యం ఇక్కడి కాంగ్రెస్ నేతలది. అందులో ఎవరు పార్టీకి విధేయులో, ఎవరు కెసిఆర్ కోవర్టులో అర్థం కాని పరిస్థితి. పార్టీకి అధ్యక్షుడిని నియమించేందుకు తీయడాది పాటు సమయం తీసుకున్న అధిష్టానానికి… జరుగుతున్న కుమ్ములాటలను పరిష్కరించేందుకు సమయం దొరకడం లేదు..

ఎవరికి వారే యమునా తీరే
ఈ సామెత అచ్చుగుద్దినట్టు కాంగ్రెస్ నాయకులకు సరిపోతుంది.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి ఉద్యమాలు చేస్తుంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఒక్క నాయకుడు కూడా గట్టిగా ప్రచారం చేయలేదు.. పైగా తమ పార్టీ ఓట్లను ఎటువంటి భేషజం లేకుండా టిఆర్ఎస్ పార్టీకి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో విజేత గా నిలిచిన కాంగ్రెస్ పార్టీ.. ఈసారి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడం ఆ పార్టీ నేతల పనితీరుకు నిదర్శనం.
ఎందుకు ఉద్యమాలు చేయరు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులైన తర్వాత అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు.. పార్టీ లోపేతానికి కృషి చేశారు. కృషి చేస్తూనే ఉన్నారు.. రేవంత్ రెడ్డి కాళ్ళల్లో కట్టెలు పెట్టే నాయకులు ఎంతోమంది. ఇటీవల మధిరలో పాదయాత్ర నిర్వహించిన భట్టి విక్రమార్క… అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టలేదు. భట్టి లాంటి నాయకుడే రేవంత్ రెడ్డిని గుర్తించకపోతే. . ఇక ప్రజలు ఎలా గుర్తు పెట్టుకుంటారు? నేతల మధ్య సమన్వయం లేదు అనడానికి ఇది చిన్ని ఉదాహరణ మాత్రమే.

ప్రత్యర్థి పార్టీకి చేరవేరుస్తున్నారు
హుజురాబాద్ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ పార్టీ దళిత బంధు అనే కార్యక్రమాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న కేసీఆర్… పిల్వగానే భట్టి విక్రమార్క నేరుగా ప్రగతి భవన్ వెళ్ళిపోయారు. ప్రభుత్వాన్ని పొగిడారు. ఇలాంటివారు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ తప్పిదాలను ఎలా వివరిస్తారు? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మంచిదే. కానీ అందులో ఉన్న నేతలే పక్కా కమర్షియల్. సొంత లాభం కోసం ఏమైనా చేస్తారు. ఎంతకైనా తెగిస్తారు. వల్లే కదా పార్టీ నానాటికీ భ్రష్టు పట్టి పోతుంది. రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఇలాంటి స్థితిలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎలా ఊహించుకుంటారనేది ఆ పార్టీ నాయకులు ఎప్పటికీ గుర్తిస్తారో?