Kavitha comments on Harish Rao: కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తే అర్ధం ఉంది. కాషాయం పార్టీ నేతలు విమర్శలు చేస్తే ఓ అర్థం ఉంది. కానీ ఆ ఎత్తిపోతల పథకం విషయంలో కాంగ్రెస్, బిజెపి నాయకులు కాకుండా సాక్షాత్తు కేసీఆర్ ఇంటి మనిషి ఆరోపణలు చేసింది. మామూలుగా కాదు.. ఆ పథకం లక్ష్యం వేరైతే.. వాళ్లు మాత్రం దోచుకున్నారని చెప్పేసింది. సొంత ఆస్తులను పెంచుకున్నారని మొహమాటం లేకుండా వ్యాఖ్యానించింది. వాస్తవానికి ఈ ప్లేస్ లో గనుక మరొక నాయకురాలు లేదా నాయకుడు గనుక ఉండి ఉంటే కేసీఆర్ ట్రీట్మెంట్ వేరే విధంగా ఉండేది. కానీ అక్కడ ఉన్నది కేసీఆర్ కుమార్తె కాబట్టి గులాబీ పార్టీ సమాధానం చెప్పుకోదు. సమాధానం చెప్పలేదు.
ఇవాల్టికి కూడా రేవంత్ తనను ఏమీ చేయలేడని.. సిబిఐ వాళ్ళ ఏమీ కాదని గులాబీ పార్టీ ధీమా. వాస్తవానికి కాగల కార్యాలు గంధర్వులు తీర్చినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి చేయాల్సిన పనిని గులాబీ అధినేత ఇంటిమనిషి చేయడం నిజంగా తెలంగాణ రాజకీయాల్లో ఆశ్చర్యకరం. అమెరికా నుంచి వచ్చిన తర్వాత గులాబీ దళపతి కుమార్తె జాగృతి అధినేత్రి మొహమాటం లేకుండానే విలేకరుల సమావేశం పెట్టారు. తన తండ్రి గొప్పవాడు అని చెబుతూనే.. నాటి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని.. సొంత ఆస్తులు పెంచుకున్నారని బాంబు పేల్చింది. రాజ్యసభ మాజీ సభ్యుడు కూడా అడ్డగోలుగా ప్రవర్తించారని.. దానికి ఓ బడా కాంట్రాక్టర్ సహకరించారని జాగృతి అధినేత్రి కుండబద్దలు కొట్టారు. వాస్తవానికి ఈ పరిణామాన్ని గులాబీ పార్టీ ఊహించలేదు. గులాబీ పార్టీ సోషల్ మీడియా కూడా అంచనా వేయలేదు. కవిత ఎటువంటి శషభిషకు తాగులేకుండానే మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి తీరును విమర్శిస్తూనే.. బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూనే.. కాళేశ్వరం విషయంలో అసలు నిజాన్ని బయటపెట్టారు. తద్వారా రేవంత్ క్యాంప్ కు ఊహించని ఉప్పందించారు.
ఫ్యామిలీలో విభేదాలు నిజమే
జాగృతి అధినేత్రి మాటల ద్వారా కాళేశ్వరం లో అవినీతి అనేది నిజమని తేలిపోయింది. అంతేకాదు ఆమె ఓపెన్ గానే తన కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వాటికి ఆమె కట్టుబడి కూడా ఉంటానని చెప్పారు. కవిత మాటల ద్వారా ఆమె కుటుంబంలో విభేదాలు ఉన్నాయని.. అవి మరింత తారస్థాయికి చేరాయని తేలిపోయింది. అయితే ఇవి అమితుమీ తేల్చుకునే దాకా వెళ్ళిపోయాయని అర్థమవుతోంది. అయితే ఇవి ఇక్కడితోనే ఆగిపోతాయా.. అంతకుమించి అనే స్థాయికి చేరుకుంటాయనేది కాలమే చెప్పాలి. మరోవైపు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడ్డారని.. అవి కేసీఆర్ కు తెలుసు కాబట్టే రెండవ టర్మ్ లో మంత్రి పదవి ఇవ్వలేదని జాగృతి అధినేత్రి చెప్పారు. దీంతో నాటి ముఖ్యమంత్రికి తెలియకుండానే అడ్డగోలు వ్యవహారాలు జరిగి పోయాయని.. అవి ఆయనకు తెలుసు కాబట్టి సిద్దిపేట ఎమ్మెల్యేను దూరం పెట్టారని కవిత స్పష్టం చేశారు. జాగృతి అధినేత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి.