Vegetable Prices: రాష్ట్రంలో కూరగాయల ధరలకు రెక్కొలొచ్చాయి. రోజు రోజుకూ పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో కూరగాయలు కొనాలంటేనే వెనకా ముందు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. వారం క్రితం వరకు రూ.200 తీసుకుని మార్కుట్‌కు వెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి.. కానీ ఇప్పుడు చేతినిండా డబ్బులు తీసుకెళ్లినా.. సంచిలో సగం కూరగాయలు కూడా రావడం లేదు. దీంతో ఏం కోనెటట్టు లేదు.. ఏం తినే టట్టు లేదు అంటూ మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు..
తగ్గిన దిగబుడి.. పెరిగిన ధరలు..
వేసవి, రుతుపవనాలు వచ్చినా.. వర్షాలు కురవకపోవడం తదితర కారణాలతో రాష్ట్రంలో కూరగాయల దిగుబడి తగ్గిపోయింది. మే నెలలో కురిసిన అకాల వర్షాలకు తోటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు కూరగాయల ధరలు పెంచేశారు. రైతులు కొంత పెంచితే.. వ్యాపారులు రెట్టింపు చేసి అమ్ముతున్నారు. ఇక ముందస్తు ప్రణాళికలు ఉన్నా ప్రభుత్వం ఆచరణలో విఫలం కావడంతో ప్రజల నడ్డి విరిచేలా ధరలు పెరుగుతున్నాయి.
పెరిగిన ధరలు ఇలా..
మొన్నటి వరకు కిలో రూ.20 ఉన్న టమాటా ఇప్పడు రూ.60కి చేరింది. రైతు బజార్‌లో అయితే రూ.50 పలుకుతోంది. బీరకాయ, సోరకాయలు కిలో రూ.60కిపైగానే ఉన్నాయి. కిలో మిర్చి మొన్నటి వరకు 50 రూపాయలు ఉండగా, ఇప్పుడు రెట్టింపై కిలో 100 రూపాయలకు పైగానే పలుకుతోంది. బెండకాయలు రూ.55 కిలో పలుకుతున్నాయి.
కొత్త పంటలు వేయడం..
మరోవైపు వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు ఇప్పటి వరకు ఉన్న పంటలను తొలగించారు. కొత్త పంటలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో కూడా దిగుబడి లేక ధరలు మరింత పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా కూడా ధరలు మండుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం, రవాణా ఖర్చులు పెరగడం కూడా కూరగాయల ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు.