https://oktelugu.com/

TS DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. డిగ్రీ మార్కులతో సంబంధం లేకుండా టీచర్‌ పోస్టు!

గతంలో టీచర్‌ పోస్టుల భర్తీకి జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో జనరల్‌ అభ్యర్థులు డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత అయి ఉండాలనే నిబంధన ఉండేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉన్నా అర్హత ఉండేది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 14, 2024 / 12:13 PM IST

    TS DSC

    Follow us on

    TS DSC: తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇన్నాళ్లూ డిగ్రీ మార్కులు తక్కువగా ఉండి డీఎస్సీ రాయలేకపోయిన వారు కూడా ఇకపై డీఎస్సీ రాసే అవకాశం కల్పించింది. 2011కు ముందు డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ అవకాశం ఇచ్చింది. ఇక, 2011 తర్వాత డిగ్రీ చేసిన వారి అర్హత మార్కులను కూడా 50 శాతం నుంచి 45 శాతానికి తగ్గించింది. ఈమేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో 14 విడుదల చేశారు.

    గతంలో ఇలా…
    గతంలో టీచర్‌ పోస్టుల భర్తీకి జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో జనరల్‌ అభ్యర్థులు డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత అయి ఉండాలనే నిబంధన ఉండేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉన్నా అర్హత ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కూడా ఇవే అర్హత మార్కులుగా పేర్కొన్నారు. తాజాగా దానిని సవరిస్తూ జీవో విడుదల చేశారు. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం స్కూల్‌ అసిస్టెంట్, లాంగ్వేజ్‌ పండిత్, పీఈటీ తదితర పోస్టుల మార్కుల శాతాన్ని తగ్గించారు.

    అర్హత మార్కులపై కోర్టుకు..
    గతంలో ఉన్న అర్హత మార్కులపై కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో మార్కుల శాతాల్లో మార్పులు చేసూ ఎన్‌సీటీఈ గెజిట్‌ జారీ చేసింది. 2011, జూలై 29కి ముందు డిగ్రీ పాస్‌ అయిన అందరూ డిగ్రీ మార్కులతో సంబంధం లేకుండా డీఎస్సీకి అర్హులని తెలిపింది. ఇక 2011 తర్వాత డిగ్రీ చేసిన వారికి ఓసీ అభ్యర్థులు 45 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్సీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుందని ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది.

    పట్టించుకోని గత సర్కార్‌..
    ఎన్‌సీటీఈ జారీ చేసిన ఈ ఉత్తర్వులను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. పాత పద్ధతిలోనే మార్కుల అర్హతగా పేర్కొని డీఎస్సీనోటిఫికేషన్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టులను రెట్టింపు చేయడంతోపాటు డిగ్రీ అర్హత మార్కులను ఎన్‌సీటీడీ నిబంధనల మేరకు మార్చింది.

    జూన్‌ 20 వరకు దరఖాస్తులకు ఛాన్స్‌..
    ఇక డీఎస్సీ దరఖాస్తు గడువును ప్రభుత్వం గతంలోనే పొడిగించింది. జూన్‌ 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తాజా జీవో ప్రకారం డిగ్రీలో తక్కువ మార్కులు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది.