https://oktelugu.com/

Telangana BJP President  : బీజేపీ అధ్యక్ష పదవికి బిగ్‌ టాస్క్‌.. అందులో పాస్‌ అయితేనే పార్టీ పగ్గాలు!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి పది నెలలు కావస్తోంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసి కూడా మూడు నెలలు గడిచింది. కానీ, తెలంగాణలో బీజేపీకి శాశ్వత అధ్యక్షుడు లేడు. ఏడాదిగా తాత్కాలిక అధ్యక్షుడి సారథ్యంలోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 14, 2024 / 12:59 PM IST

    Telangana BJP President 

    Follow us on

    Telangana BJP President  :  తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతంగా బీజేపీ పుంజుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పొత్తులతోనే కొన్ని సీట్లు నెగ్గిన బీజేపీ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా 8 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఒంటరిగా 8 సీట్లు నెగ్గి మరింత సత్తా చాటింది. కాషాయ పార్టీకి ఇంత ఊపు రావడానికి ప్రధాన కారణం మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. 2020లో పార్టీ పగ్గాలు చేపట్టిన సంజయ్‌ పార్టీకి అనూహ్యంగా ఊపు తీసుకువచ్చారు. పాదయాత్రతో పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లారు. అయితే అనూహ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అధిస్టానం సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. తాత్కాలిక అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నియమించింది. ఆయన సారథ్యంలోనే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొంది. దీంతో బీజేపీ సీట్లు తగ్గాయి. సంజయ్‌ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లి ఉంటే.. బీజేపీ కనీసం మరో 8 స్థానాలు అయినా గెలిచేంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ మోదీ మేనియాతో సగం లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది. అయితే ఎన్నికలు ముగిసినా పార్టీకి అధ్యక్షుడిని నియమించలేదు. ఇటీవలే దీనిపై కసరత్తు ప్రారంభించింది జాతీయ నాయకత్వం.

    ఆశావహులకు టాస్క్‌..
    తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అధిష్టానం జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించింది. దీంతో ఆయన తెలంగాణలో పార్టీపై ఫోకస్‌ పెట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే నూతన సారథి ఎంపికపై జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పార్టీ ఆరేళ్ల కోసారి చేపట్టే సభ్యత్వ నమోదు మొదలు పెట్టింది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 70 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో సభ్యత్వం కూడా మరో 70 లక్షలు చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరక అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారికి టార్గెట్‌ విధించినట్లు తెలుస్తోంది.

    భారీ లక్ష్యంతో..
    తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. కానీ, బీజేపీ అధిష్టానం రాష్ట్రంలో 70 లక్షల సభ్యత్వాలు టార్గెట్‌ పెట్టడంపై కమలం నేతలో షాక్‌ అయ్యారు. ఇంత టార్గెట్‌ రీచ్‌ కావడం కష్టమే అంటున్నాయి. అయితే అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలు మాత్రం దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్నారు. పోటీపడి సభ్యత్వాలు చేయిస్తున్నారు. ఎవరు ఎక్కువ సభ్యత్వాలు చేయిస్తే వారికి పార్టీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో
    టార్గెట్‌ రీచ్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.