https://oktelugu.com/

Ravi Prakash : రవి ప్రకాష్ పై ఉచ్చు బిగించిన మెఘా.. రంగంలోకి యూరో ఎగ్జిమ్ బ్యాంక్..

తను స్థాపించిన టీవీ9ను కొనుగోలు చేసి.. తనను బయటకు పంపించడంతో కొద్దిరోజులుగా రవి ప్రకాష్ మెఘా పై మంటతో రగిలిపోతున్నాడు. ఆ మధ్య కోర్టు కేసులు కూడా ఎదుర్కొన్నాడు. అప్పటి ప్రభుత్వం మెఘా కు అత్యంత దగ్గర కావడంతో రవి ప్రకాష్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎన్ని పాచికలు వేసినా రవి ప్రకాష్ కు ఉపశమనం లభించలేదు. తీరా గత ప్రభుత్వం తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత రవి ప్రకాష్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 4, 2024 / 12:11 PM IST

    Ravi Prakash

    Follow us on

    Ravi Prakash : ఇటీవలి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో రవి ప్రకాష్ అప్పటి అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన స్వరం వినిపించాడు. పార్లమెంటు ఎన్నికల్లోనూ సున్నా ఫలితాలు వస్తాయని ముందుగానే చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే అప్పటి అధికార పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాసీట్లను సాధించింది. ఇదే ఊపులో రవి ప్రకాష్ తనలో ఉన్న పాత జర్నలిస్ట్ ను నిద్ర లేపాడు. తన యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ పేరుతో సంచలనానికి తెర లేపాడు. తనకు నిద్రలేని రాత్రులను పరిచయం చేసిన మెఘా కంపెనీకి షాక్ ఇచ్చేలాగా సరికొత్త విషయాలను తెరపైకి తీసుకువచ్చాడు..” మెఘా కంపెనీ మోసానికి పాల్పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఆ కంపెనీ డొల్ల బ్యాంకులతో లేనిపోని షూరిటీలు ఇస్తోంది.. ప్రభుత్వాలకు మెఘా కంపెనీ తరఫున షూరిటీ ఇస్తున్న బ్యాంకు పేరు యూరో ఎగ్జిమ్ .. ఇది ఎక్కడో కరేబియన్ దీవులలో ఉంది. దీనికంటూ సొంత ఆఫీస్ కూడా లేదు. హైదరాబాదులో కార్యాలయం ఉందని చెబుతోంది గాని.. అక్కడికి వెళ్లి చూస్తే తప్పుడు చిరునామా ఉంది.. ఇదంతా మొత్తం బోగస్. ప్రభుత్వాలను మెఘా కంపెనీ పూర్తిగా మోసం చేస్తోంది. అడ్డగోలుగా కాంట్రాక్టర్లను దక్కించుకొని ప్రఖ్యాత సంస్థలను తొక్కిపడేస్తోంది. మెఘా సంస్థ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.. మెఘా కంపెనీకి దొంగ షూరిటీలు ఇస్తున్న యూరో ఎగ్జిమ్ బ్యాంక్ పై చర్యలు తీసుకోవాలి. మెఘా కంపెనీని నిషేధ జాబితాలో పెట్టాలి. ఆ కంపెనీకి ఎటువంటి వర్క్ ఆర్డర్స్ ఇవ్వకూడదు. ఈ మోసాన్ని బట్టబయలు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడి చర్యలు తీసుకోవాలని” రవి ప్రకాష్ తన కథనంలో పేర్కొన్నాడు. సహజంగానే ఈ కథనం సంచలనం సృష్టించింది. ఇది జరిగిన కొద్ది రోజులకే మెఘా కంపెనీ నాగార్జునసాగర్ వద్ద నిర్మించిన సుంకి శాల ప్రాజెక్టు గోడలు కూలిపోయాయి. దీంతో మెఘా చేస్తున్న పనుల్లో నాణ్యత పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

    మెఘా వేసిన స్కెచ్ ఇది

    రవి ప్రకాష్ ప్రసారం చేసిన కథనాన్ని మెఘా సీరియస్ గా తీసుకోలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. రవి ప్రకాష్ బయటపట్టిన దాన్ని గాలి కబురుగా కొట్టి పారేసిందనే వార్తలు వినిపించారు.. అయితే మెఘా దాన్ని అంత సులభంగా వదిలిపెట్టలేదు. పైగా రవి ప్రకాష్ పాత శత్రువు కావడంతో మెఘా రంగంలోకి దిగింది. తెర వెనుక పనిని పూర్తి చేసింది.. తనకు షూరిటీ ఇస్తున్న యూరో ఎగ్జిమ్ బ్యాంకు ను తెరపైకి తెచ్చింది. దీంతో ఆ బ్యాంకు బాధ్యులు రవి ప్రకాష్ పై ఒంటి కాలు పై లేచారు. తనపై అసత్యాలు ప్రచారం చేసిన రవి ప్రకాష్ పై 100 కోట్ల పరుగున రాష్ట్రానికి దావా వేశారు. ఇందులో భాగంగా గతవారం రవిప్రకాష్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఇప్పుడు ఆ కేసు విషయంలో యూరో బ్యాంక్ మరో కీలకమైన అడుగు వేసింది. కోర్టు వాదనలు, ఇతర ఖర్చుల నిమిత్తం వందకోట్ల పరువు నష్టం దావాలో భాగంగా ఒక శాతం అంటే కోటి రూపాయలను కోర్టులో డిపాజిట్ చేసింది. హైదరాబాద్ లో సిటీ సివిల్ కోర్టు 1958 లో ఏర్పడింది. ఆ కోర్టు చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ కావడం ఇదే తొలిసారి.

    రవి ప్రకాష్ ఎలా ఎదుర్కొంటారో?

    రవిప్రకాష్ కథనం నేపథ్యంలో మెఘా పై జాతీయ మీడియా దృష్టి సారించింది. ఆ కథనంలో వాస్తవాలను పరిశీలించి ప్రసారం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదే జరిగితే తన కంపెనీ పరువు గంగలో కలుస్తుందని భావించిన మెఘా.. యూరో బ్యాంకు ను తెరపైకి తెచ్చింది. రవి ప్రకాష్ పై 100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. దీంతో ఒక్కసారిగా జాతీయ మీడియా సైలెంట్ అయిపోయింది. ఎందుకొచ్చిన గొడవ అంటూ కథనాలను ప్రసారం చేయకుండా ఆగిపోయింది. మరి యూరో ఎగ్జిమ్ బ్యాంకు పరువు నష్టం దావాను రవి ప్రకాష్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.