Ration Cards: పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను జనవరి 26న ప్రారంభించింది. ఇందుకోసం గ్రామ, వార్డు సభలద్వారా అర్హులను గుర్తించింది. ఎంపిక చేసిన లబ్దిదారులకు కొత్త కార్డుల జారీపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే వెయ్యి మందికి కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో చాలా మందికి లబ్ధి కలుగనుంది. ఉచిత రేషన్‌తోపాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్‌తోపాటు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుకు అర్హులు అవుతారు. కొత్తగా కార్డు జారీ అయిన వారికి ఫిబ్రవరి నెల నుంచే ఉచిత రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. ఇక మార్చి నుంచి రేషన్ కార్డుపై సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డు పొందేవారికి కూడా లబ్ధి కలుగుతుంది.
ఎంపిక చేసిన గ్రామాల్లోనే..
అయితే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రస్తుతం ఎంపిక చేసిన గ్రామాల్లోని అర్హులకే జారీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో మిగతా గ్రామాలకు ఇప్పట్లో జారీ చేసే అవకాశం లేదు. మార్చి 5వ తేదీ వరకు కోడ్ అమలులో ఉంటుంది. అప్పటి వరకు మిగతా గ్రామాలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయరని సమాచారం. అయితే ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని జారీ చేయాలనే ఆలోచనలో ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నిరంతర ప్రక్రియ..
ఇదిలా ఉంటే.. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇకపై నిరంతరం కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అర్హత ఉండి కార్డు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. మంత్రులు కూడా రానివారు ఆందోళన చెందొద్దని, గ్రామా, వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోనివారు మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.