https://oktelugu.com/

KCR : కేసీఆర్ పై నిషేధం.. షాక్ ఇచ్చిన ఈసీ

రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు, పలుకుతున్న బూతులు ఎన్నికల సంఘానికి దేవుడి ప్రవచనం లాగా వినిపిస్తున్నాయా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ బస్సు యాత్ర చేస్తుంటే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నాయకుల్లో భయం మొదలైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 1, 2024 / 09:52 PM IST

    ban on KCR

    Follow us on

    KCR : పార్లమెంట్ ఎన్నికల్లో నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఎన్నికల సంఘం కోలుకోలేని షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు ప్రచారం చేయకుండా కట్టడి చేసింది. బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి 48 గంటల దాకా కేసీఆర్ ప్రచారంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. దీనికి సంబంధించి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల ఐదున పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని సిరిసిల్ల ప్రాంతంలో భారత రాష్ట్ర సమితి సభ నిర్వహించింది. ఈ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసి… అనంతరం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంది. “ఈ నిర్ణయం మేరకు 48 గంటల పాటు ఎటువంటి సభల్లో పాల్గొనకూడదు. ర్యాలీలు చేపట్టకూడదు. ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని” ఎన్నికల సంఘం ప్రకటించింది.

    గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓటమిపాలైంది. అధికారానికి దూరమైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారత రాష్ట్ర సమితిని ఇరకాటంలో పెడుతోంది. మేడిగడ్డ, ఫోన్ ట్యాపింగ్ వంటి అనేక వ్యవహారాలను తెరపైకి తీసుకొచ్చి, ప్రజల్లో భారత రాష్ట్ర సమితిని దోషిగా చూపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో గత చరిష్మాను తిరిగి సాధించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని పలు ప్రాంతాల్లో బస్సు యాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై, భారతీయ జనతా పార్టీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెబుతున్నారు..

    ఇక ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడం, చర్యలకు ఉపక్రమించడంతో కేసీఆర్ స్పందించారు. తన మాటలను ఎన్నికల సంఘం అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదని ప్రకటించారు. తెలంగాణ మాండలికం ఎన్నికల అధికారులకు అర్థం కావడం లేదన్నారు. తనపై కావాలని కాంగ్రెస్ నాయకులు కొన్ని వ్యాఖ్యలను మాత్రమే ఎంపిక చేసుకొని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, వాటిని అమలు చేయకపోవడాన్నే తాను ప్రశ్నిస్తున్నానని కేసీఆర్ అన్నారు..

    ఇక కేసీఆర్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్న నేపథ్యంలో.. భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న విద్వేష వ్యాఖ్యలు ఎన్నికల సంఘానికి కనిపించడం లేదా? అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు, పలుకుతున్న బూతులు ఎన్నికల సంఘానికి దేవుడి ప్రవచనం లాగా వినిపిస్తున్నాయా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ బస్సు యాత్ర చేస్తుంటే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నాయకుల్లో భయం మొదలైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.