HomeతెలంగాణVote for note case  : ఓటుకు నోటు కేసులో సంచలనం.. బిఆర్ఎస్ నేత పిటిషన్...

Vote for note case  : ఓటుకు నోటు కేసులో సంచలనం.. బిఆర్ఎస్ నేత పిటిషన్ పై స్పందించిన కోర్టు!

Vote for note case : న్యాయస్థానాల్లో ఏపీ సీఎం చంద్రబాబు కు వరుస ఉపశమనం కలుగుతోంది. ప్రధానంగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఇరికించాలని తెలంగాణలో బిఆర్ఎస్, ఏపీలో వైసిపి ప్రయత్నిస్తూనే ఉంది. కానీవారి ప్రయత్నాలు ఫలించడం లేదు. న్యాయస్థానాల్లో పిటీషన్లు రద్దవుతున్నాయి. తిరస్కరణకు గురవుతున్నాయి. ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని బిఆర్ఎస్ నాయకుడు ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని కోర్టు తిరస్కరించింది. కొద్ది రోజుల కిందట మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సైతం సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో చంద్రబాబు పేరును జతచేస్తూ కొత్తగా విచారణ చేపట్టాలని ఒక పిటిషన్, కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లు రాజకీయ దురుద్దేశంతో వేసినవేనని భావించిన సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజకీయ యుద్ధాలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకోవద్దని హితవు పలికింది. వాస్తవానికి 2016 నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఇరికించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన దాఖలు చేసిన ప్రైవేటు కంప్లైంట్ పరిగణలోకి తీసుకునివరుసగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ వచ్చారు. కానీ చివరిగా అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది. ఏకంగా పిటిషన్లను రద్దు చేసింది.

* సీఎంలుగా ఉండడంతో ప్రభావితం
మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ప్రస్తుతం కేసు తెలంగాణ కోర్టులో నడుస్తోంది. దీంతో కేసు పై ఇద్దరు నేతలు ప్రభావం చూపుతారని బిఆర్ఎస్ అనుమానిస్తోంది. ఆ పార్టీకి చెందిన జగదీశ్వర్ రెడ్డి ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు మార్చాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇద్దరు సీఎంలు అయినందున కేసును ప్రభావితం చేస్తారా అంటూ ప్రశ్నించింది. ఇలా కేసులను బదిలీ చేసుకుంటూ పోతే ఎలా అని వ్యాఖ్యానించింది. పిటిషన్ ను కొట్టివేసింది.

* అప్పట్లో ప్రలోభ పరిచారని
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఓటు కోసం అప్పట్లో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. టిడిపికి మద్దతుగా ఓటు వేయాలని కోరారు. అయితే ఆ సమయంలో ప్రలోభాలకు గురి చేశారు అన్నది అభియోగం. అప్పట్లో రేవంత్ టిడిపిలోనే ఉండేవారు. అధినేత చంద్రబాబుతో నేరుగా స్టీఫెన్సన్ మాట్లాడించారు. ఈ క్రమంలో నమోదైన కేసు.. అప్పటినుంచి తెలంగాణ హైకోర్టులో విచారణ దశలో ఉంది.

* ఆ రెండు పార్టీలది అదే ప్రయత్నం
అయితే చంద్రబాబుకు ఉమ్మడి శత్రుత్వం ఉండడంతో అటు వైసిపి, అదే సమయంలో బిఆర్ఎస్ చంద్రబాబును ఎలాగైనా ఇరికించాలని చూశాయి. అందుకే ఏపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, తెలంగాణ నుంచి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. కానీ న్యాయస్థానాలు మాత్రం వారి పిటిషన్లను పరిగణలోకి తీసుకోలేదు. ఆళ్ల పిటిషన్ పై రాజకీయ దురుద్దేశాన్ని గుర్తించింది కోర్టు. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ కూడా అలానే ఉందని అభిప్రాయపడింది. మొత్తానికైతే ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు వరుసగా ఉపశమనం దక్కుతుండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version