Telangana Hydra: చెరువుల పరిరక్షణ కోసం, ఆక్రమణలను తొలగించే విషయంలో హైడ్రా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా దుర్గం చెరువు విషయంలో హైడ్రా రాజీపడటం లేదు. సైబర్ సిటీగా పేరుపొందిన మాదాపూర్ ప్రాంతంలో విస్తరించి ఉన్న దుర్గం చెరువులో గత పది సంవత్సరాలుగా ఆక్రమణలు విపరీతంగా చోటుచేసుకున్నాయి.. ఈ నిర్మాణాలు మొత్తం ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉన్నాయి.. ఆ నిర్మాణాలను సర్వే చేసిన హైడ్రా, నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు.. వాటికి ఎఫ్ అనే పేరును నమోదు చేశారు. త్వరలో వీటిని పడగొట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దుర్గం చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన ఇళ్లకు ఇటీవల వాల్టా చట్టం కింద నోటీసులు జారీ చేశారు. అమర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్స్ పరిధిలో 204 నిర్మాణాలు ఉన్నాయి. వీటికి అధికారులు నోటీసులు జారీ చేశారు. 30 రోజుల్లో వీటిని తొలగించాలని వాటి యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్ టీ ఎల్ పరిధిలోకి వచ్చే నిర్మాణాలకు ఎఫ్ అని.. కొంత భాగం మాత్రమే “ఎఫ్” టీ ఎల్ పరిధిలోకి వచ్చే నిర్మాణాలకు “ఎఫ్/ పీ” అని.. బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే నిర్మాణాలకు “బీ” అని గోడలపై రాస్తున్నారు. దుర్గం చెరువు పరిధిలో ఎకరం విలువ 100 కోట్ల వరకు ఉంటుందని.. ఇక్కడ గజం లక్షకు పైగా పలుకుతోందని తెలుస్తోంది.
అధికారులపై..
దుర్గం చెరువు పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు హైడ్రా సిద్ధమవుతోంది.”అప్పుడు ఎవరు ఆయా పోస్టులలో ఉన్నారు? వేటిని పరిగణలోకి తీసుకొని అనుమతులు ఇచ్చారు? ఇందులో ఏమైనా తెర వెనుక వ్యవహారాలు జరిగాయా? రాజకీయ ఒత్తిళ్లు చోటు చేసుకున్నాయా? అనుమతులు పొంది నిర్మాణాలు చేసిన వ్యక్తులు ఎవరు? వారి నేపథ్యం ఏమిటి?” అనే అంశాల తీరుగా హైడ్రా అధికారులు ఆరా తీస్తున్నారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. నాడు ఆక్రమణలకు పచ్చ జెండా ఊపిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతం ప్రభుత్వం ఉపక్రమిస్తోందని తెలుస్తోంది. అయితే దుర్గం చెరువు పరిధిలో ఉన్న నిర్మాణాలు మొత్తం బడా బాబులకు చెందినవని తెలుస్తోంది. అమర్ కోపరేటివ్ సొసైటీలో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి ఒక భవనాన్ని కొనుగోలు చేశారు. ఆయన భవనాన్ని కూడా కూల్చివేస్తారని తెలుస్తోంది. ఈలోగా నాడు ఆక్రమణలకు రైట్ రైట్ చెప్పిన అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.