TS Minister Son: అప్పట్లో.. అంటే అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగు చూసిన సమయంలో.. అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్సీని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ వారు ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆ న్యూస్ ప్రజెంటర్ పలు ప్రశ్నలను ఆ ఎమ్మెల్సీ ని అడిగారు. అదే సమయంలో ఆమె ధరించిన చేతి వాచీ ధర ఎంత అని అడిగితే.. జస్ట్ 40 లక్షలు అని చెప్పింది. దానికి ఆ న్యూస్ ప్రజెంటర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. “2014 ఎన్నికల్లో అఫిడవిట్ సమర్పించేటప్పుడు మీకు సొంత ఇల్లు కూడా లేదని పేర్కొన్నారు.. ఇప్పుడు అంతటి వాచ్ ఎలా వచ్చిందని” ఆ న్యూస్ ప్రజెంటర్ ప్రశ్నించాడు.. దానికి ఆమె “వ్యాపారం చేశానని” సమాధానం చెప్పింది. సీన్ కట్ చేస్తే మద్యం కుంభకోణంలో అరెస్టయి ఇప్పుడు జైలు పాలైంది.
సింగపూర్ నుంచి తెప్పించారట..
మళ్లీ ఇప్పటికాలానికి వస్తే.. ఇటీవల సింగపూర్ ప్రాంతం నుంచి భారత దేశంలో లభించని కొన్ని కోట్ల విలువైన రెండు చేతి గడియారాలను ఓ వ్యక్తి తీసుకొచ్చాడు. అది ఎవరు ఆర్డర్ ఇచ్చారని చెన్నైలోని కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తే.. తెలంగాణలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మంత్రి కొడుకు ఆర్డర్ ఇచ్చాడని తేలింది. ఇంతకీ ఆ మంత్రి కుమారుడికి చేతి గడియారాలు తెచ్చిన వ్యక్తి ఇలాంటి “నల్ల” వ్యవహారాలలో ఆరితేరిన ఘనుడట. గతంలో అతడు ఇలాంటి ఘనకార్యాలు చాలానే వెలగబెట్టాడట. అప్పట్లో చిక్కినట్టే చిక్కి పారిపోయాడట.అతడి కోసం పోలీసులు తీవ్రంగానే గాలిస్తున్నారట. వెతకబోతున్న తీగ కాలికి తగిలినట్టు.. సింగపూర్ నుంచి వచ్చిన చేతి గడియారాల గురించి ఆరా తీస్తే ఆ “నల్లఘనుడు” పట్టుబడ్డాట.. ఇంకేముంది అతడు చెప్పిన సమాచారం ఆధారంగా చెన్నైలోని కస్టమ్స్ పోలీసులు కూపీ లాగితే తెలంగాణ లోని అధికార పార్టీ కి చెందిన మంత్రి కుమారుడి ఘనకార్యమని తేలింది. గత నెలలోనే ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసును విచారించగా ఈ వివరాలు బయటపడ్డాయి. విచారణకు రావాలని ఆ మంత్రి కుమారుడికి చెన్నై నుంచి కస్టమ్స్ పోలీసులు నోటీసులు ఇస్తే.. జ్వరంగా ఉందని.. తర్వాత వస్తానని ఆ మంత్రి కుమారుడు సమాధానం చెప్పాడట.
మనదేశంలో దొరకవట..
వాస్తవానికి ఆ మంత్రి కుమారుడు ఆర్డర్ చేసినవి స్మ** గూడ్స్. అవి మనదేశంలో దొరకవు. సింగపూర్ లో మాత్రమే లభ్యమవుతాయి. మంత్రి కుమారుడై ఉండి కూడా అతడికి ఆ మాత్రం సోయిలేదు. ఈ వ్యవహారం బయటపడితే ఎంత పెంట అవుతుందో కనీసం అంచనా వేయలేకపోయాడు. గత పది సంవత్సరాలు “ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ” ప్రతిపక్షంగా ఉంది. అధికారంలోకి రావడానికి చాలా ఇబ్బందులు పడింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కీలక మంత్రి కుమారుడు ఇలాంటి వ్యవహారానికి పాల్పడటంతో ప్రభుత్వానికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి పేరు పొందిన రాజకీయ నాయకుల పుత్ర రత్నాలకు అలియాస్ జాతి రత్నాలకు డబ్బు ఏం చేసుకోవాలో తెలియదు కాబోలు. ఆయాచితంగా వచ్చి పడిన డబ్బు వారిని భూమ్మీద నిలబడనీయదు కావచ్చు. ఇక్కడ వాచీలు వారికి ఆనక ఎక్కడెక్కడ నుంచో తెప్పిస్తున్నారు. ఒకామె 40 లక్షల వాచీ పెట్టుకుంటే.. అప్పట్లో చాలామంది నోర్లు వెళ్ళబెట్టారు.. ఇప్పుడు ఒక మంత్రి కొడుకు ఖరీదు చేసిన వాచ్ విలువ 1.75 కోట్లు అంటే మూర్చపోతున్నారు..
తండ్రి వంద రూపాయల గోడ గడియారం ఇచ్చాడు
అప్పట్లో ఆ మంత్రి తన కుమారుడి కోసం తన జిల్లాలో ఒక్కో ఇంటికి 100 రూపాయల విలువైన గోడ గడియారాన్ని పంపిణీ చేశాడు. కానీ ఆయన కుమారుడు 1.75 కోట్ల వాచీని సింగపూర్ నుంచి తెప్పించుకున్నాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు నాయకులకు ప్రజలంటే ఎంత ప్రేమ.. వారి జాతి రత్నాలంటే ఎంత ప్రేమో.. ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ వాచి వ్యవహారం వెలుగు చూడడం.. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీకి ఆయాచిత వరం లాగా మారింది. ఈ వాచిని కొనుగోలు చేసే వ్యవహారంలో హవాలా రూపంలో డబ్బులు చెల్లించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవే గనక నిజమైతే ఈడి రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. తెలంగాణ మరో మహారాష్ట్ర కావచ్చు. లేకుంటే కర్ణాటక అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేకపోవచ్చు. యద్భావం తద్భవతి..