CM Revanth Reddy: కాంగ్రెస్‌ అధికారం చేపడితే రేవంత్‌కు పండగే!

తెలంగాణలో ఐదేళ్లు సీఎంగా రేవంత్‌ ఉంటారన్న భరోసా అయితే అధిష్టానం ఇచ్చింది. అయితే రేవంత్‌ మాత్రం పదేళ్లు తానే ముఖ్యమంత్రి అని ఇటీవల ప్రకటించారు.

Written By: Raj Shekar, Updated On : May 24, 2024 5:20 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని ఆ పార్టీ నేతలు కొన్ని రోజులుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన ఐదు విడతల పోలింగ్‌ సరళిని లెక్కలు వేసుకుంటూ కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వస్తాయో ఓ అంచనాకు వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రకారం.. కాంగ్రెస్‌ ఒంటరిగా 150 సీట్లు గెలుస్తుందని రాహుల్‌గాంధీ ప్రకటించారు. మరో 150 సీట్లు మిత్ర పక్షాలకు వస్తాయని అంటున్నారు. దీంతో కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్‌లో జోష్‌..
కాంగ్రెస్‌ పార్టీ అంచనాలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిలో జోష్‌ కూడా క్రమంగా పెరుగుతోంది. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపడితే తనకు తిరుగు ఉండదన్న భావనలో ఉన్నారు రేవంత్‌. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన తన సన్నిహతుల వద్ద పదేపదే చెబుతున్నారు. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నది కేవలం మూడు రాష్ట్రాల్లోనే. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఆ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ఖర్చులకు ఈ రాష్ట్రాల నుంచే భారీగా నిధులు కాంగ్రెస్‌కు అందుతున్నాయి. రేవంత్‌రెడ్డి అయితే అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేసేందుకు మిగతా రాష్ట్రాలకన్నా ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

గెలిస్తే పదేళ్లు సీఎం..
తెలంగాణలో ఐదేళ్లు సీఎంగా రేవంత్‌ ఉంటారన్న భరోసా అయితే అధిష్టానం ఇచ్చింది. అయితే రేవంత్‌ మాత్రం పదేళ్లు తానే ముఖ్యమంత్రి అని ఇటీవల ప్రకటించారు. తన ప్రభుత్వాన్ని ఎవరూ టచ్‌ చేయలేరని హెచ్చరించారు. దీని వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు రాష్ట్రం నుంచి భారీగా నిధులు సమకూర్చుకుంటూ పార్టీలో పట్టు పెంచుకుంటున్న రేవంత్‌.. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మరింత పట్టు సాధించాలని భావిస్తున్నారు. తద్వారా ఇప్పటికీ సీఎం పదవి ఆవిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారికి చెక్‌ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. పదేళ్తు తన సీటు ఖాయం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

కేంద్రం నుంచి భారీగా నిధులు..
మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అప్పులన్నీ తీరుతాయని, సంక్షేమ పథకాలకు భారీగా నిధులు వస్తాయని భావిస్తున్నారు. అందుకే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారు. దీనికోసం తెలంగాణ నుంచి అధిక స్థానాలు ఇవ్వడానికి సర్వశక్తులు ఒడ్డారు. కానీ, ఆశించిన ఫలితాలు రావని ఇప్పటికే టీపీసీసీ ఓ అంచనాకు వచ్చింది. అయినా కేంద్రంలో కాంగ్రెస్‌ వస్తుందని రాహుల్‌ ప్రకటించడం సీఎం రేవంత్‌కు ఉత్సాహాన్ని ఇచ్చింది.