Medigadda Barrage: మేడిగడ్డలో వద్ద మళ్లీ శబ్దాలు.. బ్యారేజీ భద్రతపై ఆందోళన!

తాజాగా బుధవారం 7వ బ్లాక్‌లోని 16వ నంబర్‌ గేటు ఎత్తు తుండగా భూగర్భంలో పెద్ద శబ్దాలు వినిపించాయి. ప్రకంపనలు కూడా వచ్చాయి. దీంతో పనులు ఆపేశారు.

Written By: Raj Shekar, Updated On : May 24, 2024 5:16 pm

Medigadda Barrage

Follow us on

Medigadda Barrage: తెలంగాణ ప్రాణంగా బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌ బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగానే కుంగింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి ఇదీ ఒక కారణం. బ్యారేజీలోని 7వ బ్లాక్‌ కుంగి దాదాపు పది నెలలు కావస్తోంది. ఎన్నికలు జరగడం, ప్రభుత్వం మారడంతో ఇప్పుడు 7వ బ్లాక్‌ మరమ్మతులపై కాంగ్రెస్‌ సర్కార్‌ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో కుంగిన గేట్లను ఎత్తే ప్రయత్నం చేస్తోంది.

16వ గేటు వద్ద శబ్దాలు..
తాజాగా బుధవారం 7వ బ్లాక్‌లోని 16వ నంబర్‌ గేటు ఎత్తు తుండగా భూగర్భంలో పెద్ద శబ్దాలు వినిపించాయి. ప్రకంపనలు కూడా వచ్చాయి. దీంతో పనులు ఆపేశారు. పెద్ద శబ్దాల వెనుక ఏం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏడవ బ్లాక్‌ పియర్‌ కింద భారీ బుంగ పడి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. దాని కారణంగానే గేటు ఎత్తుతుండగా శబ్దాలు వస్తున్నాయని భావిస్తున్నారు.

పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి..
గతంలో వచ్చిన వరదల కారణంగా బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయిందని బావిస్తున్నారు. దీనికారణంగా 12 వేల నుంచి 15 వేల క్యూబిక్‌ మీటర్ల పరిమాణంలో భారీ బొరియ ఏర్పడి ఉండొచ్చని జియో ఫిజికల్, జియోటెక్నికల్‌ పరీక్షల ద్వారా అంచనావకు వచ్చారు. ఈ క్రమంలో టన్నులకొద్దీ బరువు ఉండే గేటు ఎత్తుతున్న క్రమంలో పునాదులపై ఒత్తిడి పడి శబ్దాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు.

ఖాళీలు పూడ్చాకే గేట్లు ఎత్తాలని..
ప్రస్తుత పరిస్థితిలో గేట్లు ఎత్తడం మంచిది కాదని ఇంజినీర్లు భావిస్తున్నారు. పునాదుల కింద ఏర్పడిన ఖాళీలు పూడ్చిన తర్వాతనే గేట్లు ఎత్తాలని నిర్ణయించారు. ఇప్పటికే నీటి లీకేజీలను ఆపేందుకు బ్యారేజీ కుంగిన వెంటనే 40 వేల ఇసుక బస్తాలు వేశారు. అయినా ఇప్పటికీ భారీ ఖాళీ ఉందని భావిస్తున్నారు.

పరీక్షలు చేయించడంపై దృష్టి..
మేడిగడ్డ బ్యారేజీ దిగువన ఇసుక కొట్టుకుపోవడంతో ఏర్పడిన ఖాళీ ప్రదేశం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కుంగిన ఏడు నంబర్‌ బ్లాక్‌ దిగువకే ఈ బొరియ పరిమితమై లేదని, మొత్తం బ్యారేజీ కింద ఖాళీ ప్రదేశం ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై స్పష్టత వచ్చాక నిపుణుల కమిటీ సూచన మేరకు ఇసుక, సిమెంటు మిశ్రమాన్ని పంపించి పూడ్చివేయాల్సి ఉంటుంది. మొదట ఖాళీ ప్రదేశం గుర్తించి దానిని పూడ్చిన తర్వాతనే మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ భావిస్తోంది. ఈమేరకు అవసరమైన పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.