CM Revanth Reddy: రేవంత్‌ 2 వేల కోట్లు అడిగింది అందుకేనా.. సీఎం వరద సాయంపై కేంద్రం కీలక ప్రకటన!

వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు తీవ్ర నష్టం మిగిల్చాయి. ఏపీలో అయితే విజయవాడ తీవ్రంగా దెబ్బతిన్నది. తెలంగాణలో రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు.

Written By: Raj Shekar, Updated On : September 5, 2024 12:54 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్లు వందల కిలోమీటర్లు ధ్వంసమయ్యాయి. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఉపద్రవాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. రెండు రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం.. బుధవారం(సెప్టెంబర్‌ 4న) సెక్రటేరియేట్‌లో సమీక్ష చేశారు. కేంద్రం తక్షణ సాయంగా రూ.2 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని కోరారు. ఈమేరకు లేఖ రాశారు. ఇదిలా ఉంటే.. వర్షాల సమయంలో ప్రధాని మోదీ ఏపీ, తెలంగాణ సీఎంలకు ఫోన్‌ చేశారు. అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా చూడాలని సూచించారు. తాజాగా కేంద్ర బృందాలను ఏపీకి పంపాలని నిర్ణయించారు. కానీ తెలంగాణకే ఎలాంటి బృందాలు రావడం లేదు. ఆర్థికసాయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో తమకు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిపై నివేదికను కూడా సమర్పించలేదని కేంద్రం పేర్కొంది. రాష్ట్రానికి కేంద్రం వాటా విడుదలకు అవసరమైన పత్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్‌ ఆశిష్‌ వి.గవాయ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారికి రాసిన లేఖలో పేర్కొన్నారు. డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్స్‌ ఏర్పాటు చేసిన విధానం ప్రకారం వివరాలను అందించాలని గవాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

నివేదిక ఇవ్వకుండానే సాయం కోసం లేఖ..
ఆగస్టు 31 నుంచి కొన్ని జిల్లాలు వరదల లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి, భారీ వర్షాల వల్ల ప్రతికూలంగా ప్రభావితమైనట్లు నివేదించబడింది. అయితే, ఏర్పాటు చేసిన విధానం ప్రకారం, ఎంహెచ్‌ఏ కంట్రోల్‌ రూమ్‌లో ఇప్పటివరకు ఎటువంటి అధికారిక పరిస్థితి నివేదిక అందలేదని ఆయన చెప్పారు. స్టేట్‌ అకౌంటెంట్‌ జనరల్‌ నివేదించిన ప్రకారం, ఏప్రిల్‌ 1, 2024 నాటికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఖాతాలో రూ. 1,345.15 కోట్లు, 2024–25 మధ్యకాలంలో ప్రభావిత ప్రాంతాలలో సహాయ నిర్వహణ కోసం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద కేంద్ర వాటా విడుదలకు అవసరమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్పించలేదని గవాయ్‌ పేర్కొన్నారు.

గతేడాది రెండు విడతల్లో నిధులు..
2022–23కి సంబంధించి ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు రెండవ విడత రూ. 188.80 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి 2023, జూలై 10న విడుదల చేయబడిందని ఎంహెచ్‌ఏ అధికారి తెలిపారు. అదనంగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు కేంద్ర వాటా రెండు విడతలు , 2023–24 కోసం ఒక్కొక్కటి రూ.198 కోట్లు, వరుసగా మార్చి 13, మార్చి 28 విడుదల చేసినట్లు వివరించారు. 2024–25లో రూ. 208.40 కోట్లతో కూడిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ మొదటి విడత నిధులు జూన్‌ 1న విడుదల కావాల్సి ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం విడుదల కోసం ఎటువంటి అభ్యర్థన చేయలేదు. దీంతో నిధులు ఇవ్వలేదు.

రోజువారీ నివేదిక తప్పనిసరి..
ఎంహెచ్‌ఏ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌లో సంబంధిత అధికారులను ప్రకృతి వైపరీత్యాలపై రోజువారీ పరిస్థితి నివేదికను క్రమం తప్పకుండా అందించాలని ఆదేశించాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం రెస్క్యూ మరియు రిలీఫ్‌ ఆపరేషన్ల కోసం రాష్ట్రంలో పడవలు, ప్రాణాలను రక్షించే పరికరాలతోపాటు నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ఏడు బృందాలను మోహరించినట్లు ఎంహెచ్‌ఏ అధికారి తెలిపారు. అదనంగా, రెండు ఏఐఎఫ్‌ హెæలికాప్టర్లు రాష్ట్రంలో మోహరించారు. హకీంపేట్‌ వద్ద సిద్ధంగా ఉంచారు.