KCR : రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని, రోడ్లు, వంతెనలు, చెక్ డ్యామ్‌లు నిర్మించామని చెప్పుకున్న బీఆర్‌ఎస్ పాలకుల వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉండగానే గతేడాది అక్టోబర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపయాయి. దీనిపై ఒకవైపు విచారణ జరుగుతోంది. తాజాగా అలాంటి నాసిరకమైన నిర్మాణ లోపమే తాజాగా మళ్లీ బయటపడింది. పెద్దపల్లి –జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని ముత్తారం, టేకుమట్ల మండలాల మధ్య మానేరు నది పై నిర్మాణం చేస్తున్న వంతెన సోమవారం రాత్రి వీచిన గాలికి కుప్పకూలింది.
8 ఏళ్లుగా కొనసాగుతున్న నిర్మాణం..
పెద్దపల్లి జిల్లా ముత్తారం – జయశంకర్ భూపాలపల్లి జిల్లా మధ్య 2016 లో హైలెవల్ వంతెన నిర్మాణం చేపట్టింది. అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటల రాజేందర్, ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు. 8 సంవత్సరాలు గడుస్తున్న వంతెన పనులు పూర్తి కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలను మూడేళ్లలో నిర్మించిన బీఆర్‌ఎస్‌సర్కార్ వంతెన పనులు మాత్రం కొనసా…. గిస్తూ వచ్చింది. ఇప్పటికీ అసంపూర్తిగానే మిగిలిపోయింది.
తేలిపోయిన నాణ్యత..
ఏళ్లుగా నిర్మిస్తున్న ఈ వంతెన నాణ్యత ఏపాటితో ఒక్క గాలికి తేలిపోయింది. సోమవార రాత్రి వీచిన గాలికి వంతెనలో మూడు పిల్లర్లపై ఉన్న గార్డర్‌లు కిందపడిపోయాయి. దీంతో నాణ్యతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ నాణ్యత పాటించకపోవడంతో వంతెన కుప్పకూలిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తయ్యాక కూలి ఉంటే..
ఇలా నాసిరకంగా, నాణ్యత లేకుండా నిర్మించిన వంతెన నిర్మాణ పూర్తయి ఉంటే.. దానిపై వాహనాలు వెళ్తున్నప్పుడు కూలిపోతే తీవ్ర ప్రాణ నష్టం జరిగేదని రెండు జిల్లాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనలతో బీఆర్‌ఎస్ హయాంతో చేపట్టిన నిర్మాణాల నాణ్యతను పరిశీలించాలని కోరుతున్నారు. వంతెన గార్డర్లు అర్ధరాత్రి కూలిపోవడం, ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరుగలేదు.
నాడు వరదకు, నేడు గాలికి..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని గర్మి ల్లపల్లి– పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మాణం మధ్యలో ఆగిపోయిన వంతెన గ్యాడర్లు (బెడ్లు) సోమవారం రాత్రి వీచిన గాలికి (ఓడేడు పరిధిలో) కూలిపోయాయి. శకలాలు తాత్కాలిక రోడ్డుపై పడ్డగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత జూలై నెలలో వరదలకు టేకుమట్ల రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్యలోని చలివాగు పై నిర్మించిన వంతెన వరదకు కొట్టుకుపోవడం.. ఇప్పుడు గాలికి వంతెన కూలడం మండలంలో చర్చనీయాంశం అవుతుంది.