https://oktelugu.com/

TGSRTC: ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు

హైదరాబాద్‌ నగర వాసులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బస్‌ పాస్‌ చార్జీలను భారీగా తగ్గించింది. అయితే ఇది అన్ని బస్సులకు వర్తించదు. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 7, 2024 / 01:19 PM IST

    TGSRTC

    Follow us on

    TGSRTC: ప్రయాణికులను ఆకర్షించడానికి, ఆదాయం పెంచుకోవడానికి ఇప్పటికే అనేక కొత్త పథకాలు ప్రారంభించింది తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TGSRTC). రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది. ఈ పథకంలో రద్దీ విపరీతంగా పెరిగింది. దీనికి తగినట్లుగా బస్సులు నడిపేందుకు కొత్త బస్సులు కూడా కొనుగోలు చేస్తోంది. ఉచిత పథకం తర్వాత రద్దీ పెరగడమే కాకుండా ఆదాయం కూడా బాగా వస్తోంది. మహిళలే కాకుండా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా పథకాలు తీసుకువస్తోంది. తాజాగా ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది.

    ఆ ధరల తగ్గింపు..
    హైదరాబాద్‌ నగర వాసులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బస్‌ పాస్‌ చార్జీలను భారీగా తగ్గించింది. అయితే ఇది అన్ని బస్సులకు వర్తించదు. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తుంది. టికెట్‌ ధరలను తగ్గించింది. నెలవారీ బస్‌ పాస్‌ ధర కూడా తగ్గిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కేవలం రూ.1,900 కే నెలవారీ పాస్‌ను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. గతంలో ఈ బస్‌ పాస్‌ ధర రూ.2,530 ఉండగా.. ప్రయాణికుల కోసం తాజాగా ఆర్టీసీ సంస్థ దీనిపై ఏకంగా రూ.630 తగ్గించింది.

    ఈ రూట్లలో గ్రీన్‌ మెట్రో లగ్జరీ..
    సికింద్రాబాద్‌ –పటాన్ చెరువు (219 రూట్‌), బాచుపల్లి – వేవ్‌ రాక్‌(195 రూట్‌) మార్గాల్లో ఈ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ఈ రూట్లలో ప్రయాణించేవారు తక్కువ ధరకు పాస్‌ పొంది ప్రయాణించే అవకాశం ఉంది. ఈ బస్‌పాస్‌తో గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులతోపాటు ఈ–మెట్రో ఎక్స్‌ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును కల్పించడం జరిగింది. అయితే ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో నడిచే పుష్ఫక్‌ ఏసీ బస్సుల్లో చెల్లుబాటు కాదు.

    ఎక్స్‌ప్రెస్‌ పాస్‌ ఉంటే..
    ఇక మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ బస్సు పాస్‌ కలిగిన వారు రూ.20 కాంబినేషన్‌ టికెట్‌ తీసుకుని.. గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఒక ట్రిప్పులో ప్రయాణించవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్‌లోని టీజీఎస్‌ఆర్టీసీ బస్సు పాస్‌ కేంద్రాలలో ఈ పాస్‌లను సంస్థ జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. బస్‌ పాస్‌ ధర తగ్గించడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.