Kinjarapu Ram Mohan Naidu
Kinjarapu Ram Mohan Naidu: గత ఐదు సంవత్సరాలుగా ఏపీలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్కు పాదం మోపింది. గత ఎన్నికల్లో కేంద్రంలో ఉన్న బిజెపిని విభేదించింది టిడిపి. ఆ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురు కావడంతో జాతీయస్థాయిలో సైతం టిడిపి పరపతి గణనీయంగా తగ్గింది. కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. అయితే సంఖ్యా బలంగా తక్కువగా ఉన్నా.. టిడిపి ఎంపీలు గట్టిగానే వాయిస్ వినిపించారు. ముఖ్యంగా యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏపీ సమస్యలపై గట్టిగానే మాట్లాడేవారు. ప్రోటోకాల్ ప్రకారం తక్కువ సమయం కేటాయించినా.. ఉన్నంతలో పొదుపుగా, సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడేవారు. కేంద్ర పెద్దలను సైతం ఆశ్చర్యపరిచేవారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడం.. యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ కొట్టడంతో.. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత ఎన్నికల్లో టిడిపి నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని ఎంపీలుగా ఎన్నికయ్యారు. అయితే ఈ ముగ్గురిలో రామ్మోహన్ నాయుడు బలమైన వాయిస్ వినిపించేవారు. గల్లా జయదేవ్ సైతం రాష్ట్ర సమస్యలను ప్రస్తావించేవారు. అయితే పార్లమెంట్ నిర్వహణకు సంబంధించి నిబంధనల మేరకు తక్కువ సమయం తెలుగు దేశం కి వచ్చేది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన సమస్యలు, వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. కానీ ఒక్క నిమిషం మాత్రం వ్యవధి ఉండడంతో స్పీకర్ కు ప్రత్యేక అనుమతి తీసుకొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లోతెలుగుదేశం పార్టీ నుంచి వీలైనంత ఎక్కువమంది సభ్యులు లోక్సభకు వస్తారని.. అప్పుడు ఎక్కువ సమయం మీరు కేటాయించాల్సి ఉంటుందని నేరుగా స్పీకర్ కే గుర్తు చేశారు యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ టిడిపి శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. నెటిజెన్లు రామ్మోహన్ నాయుడు ప్రసంగానికి ఫిదా అవుతున్నారు.
దివంగత కింజరాపు ఎర్రం నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు రామ్మోహన్ నాయుడు. తండ్రి అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మంచి వాగ్దాటి, సమయస్ఫూర్తిగా మాట్లాడడం రామ్మోహన్ నాయుడు సొంతం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన నేర్పరి. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం రెండోసారి శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి గెలిచారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఏకంగా మూడు లక్షల 50 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. అందుకే ఇప్పుడు గతంలో రామ్మోహన్ నాయుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన కాన్ఫిడెన్స్ ను చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. రాము బేష్ అంటూ మెచ్చుకుంటున్నారు.