TG Government Employees: ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలపండి అని శాశనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఆయన కొత్త తరహా నిరసన పద్ధతిని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవిచ్చారు. అదేంటంటే ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయాలంటే జపాన్ లాంటి దేశాల్లో ఉద్యోగస్తులు రెండు, మూడు గంటలు ఎక్కువ పనిచేసి ఉత్పత్తి పెంచుతారట, దీంతో ఉత్పత్తి పెరిగి, తదనుగుణంగా ఆదాయం కూడా అదే స్థాయిలో పెరగడం వల్ల దేశ ఆర్థికవ్యవస్థ బాగుపడుతుందని వారి ఆలోచన. తెలంగాణ ఉద్యోగులు సైతం ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసేందుకు ఈ తరహా పద్దతి ఎంచుకుంటే బావుంటుందని, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అంటున్నారు.
Also Read: కేటీఆర్ ను కలిసిన తీన్మార్ మల్లన్న.. ఏంటి కథ?
ప్రభుత్వం నెత్తిన మరో సమస్య..
రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల మొదటి తారీఖు జీతం పడుతున్నది. గతంతో పోలిస్తే నాలుగైదు నెలలైనా జీతాలు లేక ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇబ్బందులు పడ్డారు. నెలవారి జీతాలు లేక ఈఎంఐలు పెండింగ్ పడి బారువడ్డీ, చక్రవడ్డీలు కడుతూ ఎలాగోలా నెట్టుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వం ఓటమి చవిచూసేందుకు ఇదీ కూడా ఒక కారణమని భావించవచ్చు. జీతాలు లేకుండా ఇలా ఎన్నాళ్లు చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులు గత ప్రభుత్వానికి వ్యతిరేకత చాటారు. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఠంచన్ గా ఫస్ట్ తారీఖు జీతం ఎత్తుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు సంతప్తి వ్యక్తం చేస్తున్న ఈ సమయంలో ప్రభుత్వాన్ని ఎలాగోలా ఇరకాటంలో పెట్టాలని ఆలోచిస్తున్నకొంతమంది విపక్ష సభ్యులు ఉద్యోగులకు డీఏను ఎప్పుడిస్తారని కొత్త సమస్యను తెరపైకి తెస్తున్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన అదనపు భత్యాలు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదని ముఖ్యమంత్రి స్పష్టంగా తెలిపారు. నెల తప్పకుండా జీతాలు ఇచ్చేందుకే రిజర్వ్ బ్యాంక్ వద్ద చేబదులు తీసుకుని ఇస్తున్నామని, రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు డీఏ గురించి దయచేసి అడగకండని ఆయన అన్నారు. డీఏ, కరువు భత్యం ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన కోరికలే కాని, ప్రభుత్వం వాటిని తీర్చేందుకు మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. వాటి కోసం ధర్నాలు, దీక్షలు చేస్తామంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుందని అన్నారు.
ఉన్నమాట చెబితే ఉలుకెందుకో.?
రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై శాశన సభల్లో ముఖ్యమంత్రి ఖుల్లం.. ఖుల్లా మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు రాష్ర్ట ప్రభుత్వం తంటాలు పడుతుండగా, కొత్తగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు మరింత కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను పరిశీలిస్తే గత ప్రభుత్వం చేసిన అప్పుల సూచిక ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా పనిచేయాలంటే ప్రథమ కర్తవ్యం వారికి ఠంచన్ గా జీతాలు నెలవారీగా చెల్లించడం. అలాగే ఇచ్చిన హామీల్లో ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణ మాఫీ, రైతు భరోసాతో పాటు, మరెన్నో సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి ఆగిపోయినా నేరుగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది. అయితే ప్రధాన హామీలపై మొదటి ఫోకస్ పెట్టిన ప్రభుత్వం, మిగతా హామీలపై ప్రస్తుతం దష్టి సారించింది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం వల్ల కూడా ఒకవైపు విద్యుత్ బిల్లులు, మరోవైపు సిలిండర్ పై సబ్సిడీ ప్రభుత్వంపై అదనపు భారం పడే అవకాశాలున్నాయి. అందుకే కొత్త రేషన్ కార్డులను ఇచ్చే విషయంలో కొంత జాప్యానికి ఇది కారణం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగోలా ప్రభుత్వానికి ఇబ్బందులు కలుగచేసి, వ్యతిరేకత ఆపాదించాలని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఏ చర్యలకు పూనుకుంటుందో చూడాలి మరీ..
Also Read: రెండోసారీ నేనే ముఖ్యమంత్రి… రేవంత్ రెడ్డిలో అంత కాన్ఫిడెన్స్ ఏంటి?