కరోనా మహమ్మారి విజృంభణ వల్ల పదో తరగతి చదువుతున్న విద్యార్థులు విద్యా సంవత్సరం ఆలస్యం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో పరీక్షలు కూడా ఆలస్యంగా జరగనున్నాయి. రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు మే నెల 17వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా మే నెల 26వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయని సమాచారం.
ప్రతి సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు 11 పేపర్ల ద్వారా పదో తరగతి పరీక్షలు జరిగేవి. అయితే ఈ ఏడాది మాత్రం విద్యాశాఖ కేవలం ఆరు పరీక్షలనే నిర్వహిస్తూ ఉండటం గమనార్హం. మే నెల 17వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్ ఏ) పరీక్ష జరగనుండగా ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోసిట్ కోర్సు, ఫస్ట్ లాంగ్వేజ్ 2 కాంపోజిట్ కోర్సు పరీక్షలు కూడా ఆరోజే జరగనున్నాయి. మే 18వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది.
మే నెల 19వ తేదీన ఇంగ్లీష్, మే నెల 20వ తేదీన గణితం, మే 21వ తేదీన ఫిజికల్ సైన్స్, బయాలజీ మే 22వ తేదీన సోషల్ పరీక్షలు జరగనున్నాయి. మే 24వ తేదీన ఓ.ఎస్.ఎస్.సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1, మే 25వ తేదీన ఓ.ఎస్.ఎస్.సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2, మే 26వ తేదీన ఎస్.ఎస్.సీ వొకేషనల్ కోర్సు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఈ నెల 25వ తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా ఫీజును చెల్లించే అవకాశం ఉంటుంది.
గడువులోగా ఫీజు చెల్లించని పక్షంలో మార్చి 3వ తేదీ వరకు ఆలస్య రుసుంతో, మార్చి 12వ తేదీ వరకు 200 రూపాయలు ఆలస్య రుసుంతో, మార్చి 16వ తేదీ వరకు 500 రూపాయల ఆలస్య రుసుంతో ఫీజును చెల్లించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.