Telugu Media : వార్త వల్ల ప్రపంచంలో వర్ధిల్లుతుంది అని వెనకటికి ఓ మహానుభావుడు చెప్పాడు. కానీ నేటి కాలంలో అది పూర్తిగా అబద్ధం. తెలుగు నాటయితే మరింత అబద్ధం. తెలుగులో వర్గాలుగా మీడియా విడిపోయింది. పార్టీలకు తగ్గట్టుగానే మారిపోయింది. నాయకులకు తగ్గట్టుగానే విభజన రేఖ గీసుకుంది. ఇక ఈ ఛానల్స్ లో డిబేట్లకు హాజరయ్యే విశ్లేషకులైతే మరీ ఘోరం!
ఒకప్పుడు మీడియా న్యూట్రాలిటిని కొనసాగించేది. వ్యక్తులకు లొంగకుండా.. వ్యవస్థ లోపాలను ప్రశ్నిస్తూ.. పార్టీల విధానాలను ఎండగడుతూ ప్రజల పక్షంగా సాగేది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వ్యక్తులకు భజన చేస్తూ.. పార్టీలకు కొమ్ముకాస్తూ.. ప్రభుత్వాలకు సాగిలపడుతూ.. ప్రకటనల కోసం అర్రులు చాస్తూ మీడియా కొనసాగుతోంది. పైగా మీడియాలోకి వ్యాపారం రావడంతో ఇది పూర్తిగా బిజినెస్ లాగా మారిపోయింది. వ్యాపారులు మీడియాలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వ్యాపారమే చేస్తారు కాబట్టి.. మీడియాను కూడా వ్యాపార వస్తువుగా మార్చేశారు. తెలుగు నాట అయితే మరింత ఘోరంగా మీడియా పరిస్థితి మారిపోయింది. ఫలానా పేపర్ పేరు చెప్తే చాలు వెంటనే ఓ రాజకీయ పార్టీకి అనుకూలమని ప్రజల్లో అభిప్రాయం కలుగుతోంది. ఫలానా ఛానల్ పేరు చెప్తే చాలు ఓ రాజకీయ పార్టీకి సానుకూలమనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమౌతోంది.
Also Read: Indian Cricketers: మీకో దండం రా బాబూ.. ఇండియన్ క్రికెటర్లను ఇలా చేశారేంట్రా?!
తెలుగు నాట మరింత దారుణం
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సమయంలో మీడియా ఆయా పార్టీలకు అనుకూలంగా మారిపోవడంతో ఏది నిజమో? ఏది అబద్దమో? తీసుకోలేని పరిస్థితి ప్రజలలో కలిగింది. ఇటీవల సాక్షి ఛానల్ లో నిర్వహించిన ఓ డిబేట్లో కృష్ణంరాజు అనే జర్నలిస్టు అమరావతి రాజధానిపై వెకిలి వ్యాఖ్యలు చేశారు. అమరావతి మహిళలపై అడ్డగోలుగా మాట్లాడారు. ఆ తర్వాత అది ఎంత రచ్చ కావాలో అంత రచ్చయింది. ఇక ఇదే సమయంలో తన చానల్లో జరిగిన తప్పును సాక్షి సమర్ధించుకోవడం.. పైగా తనకు అనుకూలమైన వ్యక్తులతో డిబేట్లు నిర్వహించడం విశేషం.ఫ్యాన్ పార్టీ అధినేత ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించినప్పుడు.. చోటు చేసుకున్న విషాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు. అతడు జగన్ కాన్వాయ్ కింద పడి చనిపోయాడని నిన్నటి నుంచి టిడిపి అనుకూల మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. అయితే దానిని ఖండించడానికి వైసిపి అనుకూల మీడియా నానా ఇబ్బందులు పడుతోంది. ఇక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఉన్నప్పుడు నెల్లూరులో చోటు చేసుకున్న ప్రమాదంలో ఎనిమిది మంది దాకా చనిపోయారు. అదంతా కూడా కార్యకర్తల తప్పు అన్నట్టుగా టిడిపి అనుకూల మీడియా వార్తలు రాసింది. దొరికిందే సందు అనుకుని సాక్షి అడ్డగోలుకు రాయడం మొదలు పెట్టింది. ఇక ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ధర్నా చేస్తే ఓ వర్గం మీడియా దానిని పట్టించుకోలేదు.
ఈ క్రమంలో నిరుద్యోగులు ఆగ్రహంతో కొన్ని పత్రికల పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిని సహజంగానే గులాబీ పార్టీ అనుకూల మీడియా తెగ ప్రజెంట్ చేసింది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మీడియా ప్రదర్శిస్తున్న రంగులకు అంతూ పొంతూ ఉండదు. ముందుగానే మనం చెప్పుకున్నట్టు మీడియా అనేది వ్యాపార వస్తువుగా మారిపోయింది కాబట్టి.. ఇందులో పనిచేసేవారిని జర్నలిస్టులు అనకూడదు. ముఖ్యంగా డిబేట్లకు వచ్చేవారిని విశ్లేషకులు అనకూడదు. కేవలం వారిని కిరాయి మూకలుగానే భావించాలి. బాడుగ వ్యక్తులుగా పేర్కొనాలి. ఈ మాట అనడంలో అభ్యంతరం లేదు. పశ్చాత్తాపం అంతకన్నా లేదు.