Telangana Vote On Account Budget
Telangana Vote On Account Budget: పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై వరాలు కురిపించింది. శనివారం శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024_2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో అన్ని వర్గాల వారికి తీపి కబురు చెప్పారు. ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షలు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ఇళ్ల స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని అన్నారు. గత ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం ఇచ్చే నిధులను వాడుకోలేదని.. కానీ తాము ఆ నిధులతో ఇండ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తామని.. ఇందుకుగాను బడ్జెట్లో 7740 కోట్లు కేటాయిస్తున్నామని భట్టి ప్రకటించారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని తీసుకొచ్చి ప్రజలను మోసం చేసిందని.. తాము మాత్రం అలా చేయకుండా ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చుతామని భట్టి శాసనసభ వేదికగా ప్రకటించారు. ఎన్నికలకు ముందు తమ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ఒకటని.. ఆ పథకం అమలు కోసం తాము కృత నిశ్చయంతో ఉన్నామని భట్టి ప్రకటించారు.
ఇక ఎన్నికల సమయంలో రైతుల వ్యవసాయ రుణాలకు సంబంధించి రెండు లక్షలను మాఫీ చేస్తామని నాయకులు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే బడ్జెట్లో రైతుల వ్యవసాయ రుణాలు రెండు లక్షల మాఫీ చేస్తామని భట్టి అన్నారు. ” దేశానికి ఈ రైతు వెన్నెముక. అతడు బాగుంటేనే దేశం బాగుంటుంది. అలాంటప్పుడు రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోకుండా కాపాడటమే మా ప్రభుత్వ ధ్యేయం. అందుకే రెండు లక్షల రుణమాఫీ పై స్పష్టమైన ప్రకటన చేస్తున్నాం” అని భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు. రుణమాఫీ మాత్రమే కాకుండా ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తాం. తగ్గట్టుగా విధి విధానాలు రూపొందిస్తున్నామని భట్టి ప్రకటించారు.
రెండు లక్షల 75 వేల 891 కోట్ల అంచనాలతో భట్టి ఆన్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.2, 01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, 29,669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు భట్టి ప్రకటించారు. ప్రజలు మార్పు కోరుకున్నారని.. వారు కోరుకున్న మార్పును చేతుల్లో చూపించేందుకు తాము బడ్జెట్ ప్రవేశపెట్టామని భట్టి అన్నారు. ఆరు గ్యారంటీలకు 53,196 కోట్లు, వ్యవసాయానికి 19,746 కోట్లు, ఐటి శాఖకు 774 కోట్లు, పురపాలక శాఖకు 11,692 కోట్లు, విద్యా రంగానికి 21,389 కోట్లు, మూసీ నది సుందరీకరణకు వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్టు భట్టి ప్రకటించారు. ప్రజావాణిలో గడిచిన రెండు నెలల్లో 43,054 దరఖాస్తులు వచ్చాయని.. అందులో కేవలం ఇళ్ళ నిర్మాణం కోసం 14,951 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఈ దరఖాస్తుల పరిశీలన కోసం కలెక్టర్లు, సంబంధిత శాఖాధిపతులకు పర్యవేక్షణ బాధ్యత ప్రభుత్వం అప్పగించింది. అంతేకాదు పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను మరింత అభివృద్ధి చేయనుంది. ప్రభుత్వం నుంచి రెండు లెదర్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రం నలుమూలలా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయి