Telangana Rising Global Summit: తెలంగాణ దశ దిశను మార్చేలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్లోబస్ సమ్మిట్ తొలిరోజు సక్సెస్ అయింది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా, తెలంగాణ ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసింది. భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే దీని ప్రధాన లక్ష్యం. డిసెంబర్ 8వ తేదీన మొదలైన సమ్మిట్‌లో మొదటి రోజునే పలు ప్రముఖ సంస్థలు రూ.3,97,500 కోట్ల విలువ చేసే పెట్టుబడుల ఒప్పందాలపై తెలంగాణ ప్రభుత్వంతో సంతకం చేశాయి.
విజన్ 2047 లక్ష్యంతో..
ఈ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ప్రజెంట్ చేశారు. సాంకేతికత, సుస్థిరతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక ఎదుగుదలకు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల్లో ముందున్న ఉద్యోగ అవకాశం పుష్కలంగా లభించే విధంగా మారతాయని ప్రకటించారు.
ప్రకృతి సంరక్షణలో రిలయన్స్ భాగస్వామ్యం..
రిలయన్స్ గ్రూప్ చెందిన వంతార సంస్థ, తెలంగాణతో కలిసి ప్రీమియం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, నైట్ సఫారీతో సహా ఆధునిక పర్యాటకం ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టు శాస్త్రీయ పరిశోధనలు, పునరావాస పథకాలు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి స్థానిక స్థాయిలో ఉద్యోగాల సృష్టికి దోహదపడుతుది. అందుకు రాష్ట్రంలోని పర్యాటక, అటవీ, పర్యావరణ శాఖలు సహాయపడతాయని ప్రకటించాయి.
అంతర్జాతీయ రేసింగ్ సెంటర్..
భారత్ ప్యూచర్ సిటీ వద్ద మోటోక్రాస్, రేసింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయడానికి సూపర్ క్రాస్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. ప్రపంచ స్థాయి ట్రాక్‌లు, ట్రైనింగ్ సెంటర్లు, ప్రఖ్యాత మోటార్ స్పోర్ట్స్ కార్యక్రమాలకు హోస్ట్‌గా నిలవడానికి ఇది రేకెత్తుతున్న ప్రాజెక్ట్. ఈ హబ్ క్రీడా, వినోద కారిడార్‌గా మారి, స్థానికులకు కొత్త ఉపాధి అవకాశాల సృష్టికి సహకరిస్తుంది.
సల్మానాఖాన్ వెంచర్స్ సమీకృత టౌన్‌షిప్
రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడితో సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియో, విలాసవంతమైన గోల్ఫ్ కోర్సు, ప్రీమియం నివాసాలకు గల టౌన్షిప్ నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి ప్రొడక్షన్, ఓటీటీ, పోస్టు–ప్రొడక్షన్ సౌకర్యాలు ఉండనున్నాయి. ఈ పెట్టుబడి రాష్ట్ర సృజనాత్మక రంగానికి దోహదపడుతుంది.
ఆరోగ్య రంగంలో అపోలో పెట్టుబడులు..
తెలంగాణలో వైద్య సేవలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి అపోలో ఆసుపత్రులు రూ.800 కోట్ల పెట్టుబడి తో డీమ్‌డ్ యూనివర్సిటీ స్థాపిస్తాయి. జీనోమిక్స్, రోబోటిక్స్, ఏఐ, డిజిటల్ హెల్త్ వంటి ఆధునిక రంగాల్లో యువ నిపుణులను తయారుచేస్తారు. మరోవైపు, 200 మందికి ఉద్యోగాలు కల్పించే కొత్త ఫార్మసీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు.
విద్య నైపుణ్యానికి యూనివర్సిటీ ఆఫ్ లండన్..
తెలంగాణలో గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా రూపాంతరం కోసం యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లండన్ విద్య, పరిశోధన, డిజిటల్ లెర్నింగ్‌లో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఉన్నత విద్యార్థులకు ఆవిష్కరణ ప్రధాన శిక్షణను అందించి, కొత్త సాంకేతిక మార్గాలను తీసుకురావడానికి వీలుకనిపిస్తుంది.
టీఎంటీజీతో సమాచార, మౌలిక నిర్మాణ విస్తరణ
ట్రంప్ మీడియా, టెక్నాలజీ గ్రూప్ తెలంగాణలో స్మార్ట్ సిటీలు, ఏఐ ఆధారిత గవర్నెన్స్, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ పెట్టుబడి ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలోని మల్టీడిసిప్లినరీ డెవలప్‌మెంట్‌కి తోడుగా నిలవనుంది.
రంగాల వారీ పెట్టుబడులు ఇవీ..
– డీప్ టెక్, ఫ్యూచర్ సిటీ – ఇన్‌ప్రాస్ట్రక్చర్ : రూ.1,04,000 కోట్లు
– పునరుత్పాదక శక్తి – పవర్ సెక్యూరిటీ : రూ.39,500 కోట్లు
– ఏరోస్పేస్ – డిఫెన్స్ లాజిస్టిక్స్ : రూ.19,350 కోట్లు
– ఆధునాతన తయారీ – కోర్ ఇండస్ట్రీ : రూ.11,960 కోట్లు